హైదరాబాద్, జూలై30 (నమస్తే తెలంగాణ) : ‘ప్రభుత్వం తీసుకునే ప్రతి కీలక నిర్ణ యం, కొత్త పథకం, ప్రధాన కార్యక్రమం, నామినేటెడ్ పోస్టుల భర్తీ, రాజకీయంగా ప్రాధాన్యం ఉన్న నియామకాలు, వివాదాస్పద అంశాలు, ప్రజల్లో చర్చకు దారితీసే చర్యలు.. ఇలాంటివన్నీ ముందుగా సమన్వయ కమిటీ ముందుంచాలి. అకడ చర్చ జరుగాలి. పార్టీ నాయకత్వం అభిప్రాయాలు తీసుకోవాలి. కమిటీ ఆమోదం పొందిన తర్వాతే ప్రభుత్వం ముందుకెళ్లాలి’ అని కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం రాష్ట్ర ముఖ్యనేతలకు తేల్చి చెప్పినట్టు ఢిల్లీ వర్గాలు తెలిపాయి. తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలతో పార్టీ అగ్రనాయకత్వం తాజాగా ప్రత్యేకంగా చర్చించినట్టు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ చరిత్రను ప్రస్తావిస్తూ, సంస్థ ప్రాధాన్యాన్ని గుర్తుచేస్తూ కీలక వ్యాఖ్యలు చేసినట్టు తెలిసింది. ‘ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి.
పదవులు శాశ్వతం కావు, పార్టీ మాత్రమే శాశ్వతం. 140 ఏండ్ల కాంగ్రెస్ ఎన్నో ఎత్తుపల్లాలు చూసింది’ అని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ స్పష్టంగా చెప్పినట్టు సమాచారం. ముఖ్యమంత్రికి, మంత్రులకు పార్టీ ఎప్పుడూ తగిన గౌరవం, ప్రాధాన్యం ఇస్తుందని, అయితే అది వ్యక్తిగత ఆధిపత్యంగా మారితే ఎలా నియంత్రించాలో అధిష్ఠానానికి బాగా తెలుసునని తేల్చి చెప్పినట్టు తెలిసింది. ఆ సందేశాన్ని చేతల్లో చూపించేందుకే సమన్వయ కమిటీ సమావేశాన్ని ఢిల్లీలో నిర్వహించారని చెప్తున్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు, టీపీసీసీ అధ్యక్షుడిని సమన్వయ కమిటీ ఎదుట కూర్చోబెట్టి, కమిటీ కన్వీనర్ వంశీచంద్‌రెడ్డి ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించారని గుర్తు చేస్తున్నారు. సమావేశానికి సంబంధించిన ఫొటోలను జాతీయ కాంగ్రెస్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసిందని, వ్యక్తుల కంటే పార్టీయే పెద్దదనే అధిష్ఠానం వైఖరికి ఇది ప్రత్యక్ష సంకేతమని రాజకీయ విశ్లేషకులు సైతం స్పష్టం చేస్తున్నారు.
నామినేటెడ్ పోస్టుల భర్తీలో ఎలాంటి తొందరపాటు వద్దని, సమన్వయ కమిటీ మరోసారి సమావేశమై తదుపరి మార్గదర్శకాలు జారీచేసే వరకు నియామకాలు చేపట్టొద్దని ఢిల్లీ పెద్దలు ఆదేశించినట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. సెప్టెంబర్ రెండోవారం వరకు ఎలాంటి రాజకీయ నియామకాలు చేపట్టొద్దని, అప్పటివరకు రాష్ట్రంలో రాజకీయ హడావుడికి కూడా దూరంగా ఉండాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సూచించినట్టు తెలిసింది. ఆలోగా నామినేటెడ్ పోస్టులకు అర్హులైన నాయకులను గుర్తించే ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారట. ఇందుకోసం 2017 సంవత్సరాన్ని ప్రామాణికంగా తీసుకోవాలన్ని ప్రతిపాదన వచ్చినట్టు సమాచారం. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉండి, కష్టకాలాన్ని ఎదుర్కొన్న సమయంలో పార్టీతో కలిసి పనిచేసిన నాయకులకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని తేల్చిచెప్పినట్టు తెలిసింది. ఎన్నికల ముందు లేదా అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలో చేరిన వారికంటే, ఏండ్ల తరబడి పార్టీ జెండా మోసినవారు, క్లిష్ట సమయంలో అండగా నిలిచినవారు, రాజకీయంగా, ఆర్థికంగా పార్టీకి తోడ్పాటునందించిన నాయకులనే ముందుగా పరిగణనలోకి తీసుకోవాలని సూచించినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రమాణాల ఆధారంగా సిద్ధంచేసే ప్రతిపాదనలకు కూడా సమన్వయ కమిటీ ఆమోదం లభించిన తర్వాతే ప్రభుత్వం తుదినిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తున్నది.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేండ్లు దాటుతున్నది. ఈ కాలంలో ప్రభుత్వం తీసుకొన్న అనేక నిర్ణయాలు, అమలు చేసిన పథకాలు, నియామకాలకు సంబంధించి పార్టీ నాయకత్వానికి ముందస్తు సమాచారం లేకుండానే జరిగాయని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. ప్రభుత్వ కార్యక్రమాల గురించి సమాచారం ఇవ్వడం లేదని, మీడియాలో చూసి తెలుసుకోవాల్సి వస్తున్నదని జిల్లా నాయకులు, సీనియర్లు, పార్టీ పదవుల్లో ఉన్నవారు కొంతకాలంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. ప్రభుత్వ నిర్ణయాలన్నీ ఒకేచోటు నుంచి వస్తున్నాయనే అభిప్రాయం ఉన్నదని చెప్తున్నారు. అందుకే సమన్వయ కమిటీని ఒక సాధారణ వేదికగా కాకుండా, ప్రభుత్వం-పార్టీ మధ్య వంతెనగా మార్చాలని అధిష్ఠానం భావిస్తున్నట్టు తెలుస్తున్నది. దీంతో ప్రభుత్వ పనులకు రాజకీయ మద్దతు పెరుగడమే కా కుండా, క్యాడర్‌లోకి బలంగా తీసుకెళ్లే అవకాశం ఉంటుందని భావిస్తున్నట్టు తెలిసింది.
సమన్వయ కమిటీ సమావేశం తర్వాత ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్‌రెడ్డి రాజకీయ ప్రాధాన్యం ఒకసారిగా పెరిగిందన్న చర్చ కాంగ్రెస్ వర్గాల్లో సాగుతున్నది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌కు సన్నిహితుడిగా జాతీయ స్థాయిలో పార్టీ సంస్థాగత వ్యవహారాలను ఆయన సమన్వయం చేస్తున్నారు. రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి, వంశీచంద్‌రెడ్డి మధ్య అభిప్రాయ బేధాలు ఉన్నాయని కొంతకాలంగా పార్టీ వర్గాల్లో ప్రచారంలో ఉన్నది. ఈ సమయంలో ఢిల్లీ సమావేశానికి సంబంధించిన అధికారిక ఫొటోల్లో వంశీచంద్‌రెడ్డికి ఇచ్చిన ప్రాధాన్యం రాజకీయంగా ఆసక్తి రేకెత్తించింది. ముఖ్యమంత్రి, మంత్రులు, టీపీసీసీ అధ్యక్షుడు పాల్గొన్న సమావేశానికి ఆయన నాయకత్వం వహిస్తున్న దృశ్యాలను కాంగ్రెస్ అధికారిక సోషల్ మీడియా వేదికల్లో ప్రముఖంగా ప్రచారం చేయడం యాదృచ్ఛికం కాదని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ప్రభుత్వం తీసుకొనే కీలక నిర్ణయాలు, నామినేటెడ్ పోస్టులు, ప్రధాన నియామకాలకు సమన్వయ కమిటీ ఆమోదం తప్పనిసరి కానున్న నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాల్లో వంశీచంద్‌రెడ్డి పాత్ర మరింత కీలకంగా మారే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు చెప్తున్నారు.