రేవంత్‌రెడ్డి ప్రభుత్వంలో తెలంగాణలో శాంతిభద్రతల పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీస్‌స్టేషన్ వద్దే దాడికి ప్రయత్నించే పరిస్థితి రావడం పోలీసు వ్యవస్థ పనితీరుపై అనేక అనుమానాలు కలిగిస్తోందన్నారు. సైఫాబాద్ పోలీస్‌స్టేషన్‌లో కేటీఆర్ పీఏ మహేందర్‌రెడ్డి, పీఆర్వో మహేశ్‌పై దాడికి ప్రయత్నించిన ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజున అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేపట్టిన నిరసనకు సంబంధించిన ఘటనలో కేటీఆర్ పీఏ మహేందర్‌రెడ్డి, పీఆర్వో మహేశ్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం కేసులు నమోదు చేసిందని కౌశిక్‌రెడ్డి తెలిపారు. విచారణ పేరుతో వినాయక చవితి పండుగ రోజున వారిని సైఫాబాద్ పోలీస్‌స్టేషన్‌కు పిలిపించడం రాజకీయ కక్షసాధింపులో భాగమేనని ఆరోపించారు.
మహేందర్‌రెడ్డి, మహేశ్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన సమయంలో సుమారు 15 మంది మాస్కులు ధరించిన వ్యక్తులు వారిపై దాడికి ప్రయత్నించారని కౌశిక్‌రెడ్డి ఆరోపించారు. పోలీసుల సమక్షంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడం మరింత ఆందోళన కలిగిస్తోందన్నారు. బీఆర్ఎస్ లీగల్ సెల్ న్యాయవాదులు అడ్డుకోవడంతోనే వారు అక్కడి నుంచి వెళ్లిపోయారని పేర్కొన్నారు. పోలీస్‌స్టేషన్‌లోకి వచ్చి.. పోలీసుల కళ్ల ముందే దాడికి ప్రయత్నించేంత ధైర్యం వారికి ఎక్కడి నుంచి వచ్చింది? వారికి ఎవరి అండ ఉంది?” అని కౌశిక్‌రెడ్డి ప్రశ్నించారు. ఘటన వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించి, పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కోలేక కేసులు నమోదు చేయడం, విచారణల పేరుతో వేధించడం, చివరకు పోలీస్‌స్టేషన్ వద్దే దాడులకు ప్రయత్నించడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని కౌశిక్‌రెడ్డి విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని.. ఆ హక్కును అణచివేయడం సరికాదన్నారు. హోంశాఖను కూడా నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ ఘటనపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పోలీసుల సమక్షంలో జరిగిన ఈ ఘటనను తేలికగా తీసుకోకుండా మాస్కులు ధరించి వచ్చిన వ్యక్తులను గుర్తించి వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
“చట్టాన్ని కాపాడాల్సిన పోలీస్‌స్టేషన్‌లోనే చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే పరిస్థితి వస్తే.. రాష్ట్రంలో సామాన్యుడికి భద్రత ఎక్కడ ఉంటుంది?” అని కౌశిక్‌రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణలో శాంతిభద్రతలను కాపాడాల్సిన ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపులను పక్కనపెట్టి ప్రజల భద్రతపై దృష్టి పెట్టాలని సూచించారు. సైఫాబాద్ పోలీస్‌స్టేషన్ ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి, దాడికి ప్రయత్నించిన వ్యక్తులను గుర్తించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి డిమాండ్ చేశారు.