సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పీఏ, పీఆర్వో పై మాస్కులు ధరించిన కొంతమంది వ్యక్తులు దాడికి పాల్పడిన ఘటనను ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తీవ్రంగా ఖండించారు. పోలీస్ స్టేషన్ వంటి అత్యంత భద్రత కలిగిన ప్రదేశంలోకి మాస్కులు ధరించి సుమారు 15 మంది వ్యక్తులు ప్రవేశించి దాడికి పాల్పడటం చూస్తుంటే రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి ఏ స్థాయికి దిగజారిందో అర్థమవుతోందని ఎమ్మెల్యే ఆందోళన వ్యక్తం చేశారు.
పోలీస్ స్టేషన్లోనే దాడులు జరిగితే సామాన్య ప్రజలకు రక్షణ ఎక్కడ ఉంటుంది? అని బండారి లక్ష్మారెడ్డి ప్రశ్నించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని దాడులకు పాల్పడే వారికి ఎలాంటి రాజకీయ అండ ఉన్నా ఉపేక్షించకుండా, ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రజాస్వామ్యంలో రాజకీయ విభేదాలు సహజమే కానీ, భౌతిక దాడులకు పాల్పడటం, భయభ్రాంతులకు గురిచేయడం ఏమాత్రం సమర్థనీయం కాదన్నారు. రాష్ట్రంలో చట్టం అందరికీ సమానంగా అమలు కావాలి.. పోలీస్ స్టేషన్లోనే చట్టాన్ని ఉల్లంఘించే పరిస్థితి రాకూడదని బండారి లక్ష్మారెడ్డి గారు స్పష్టం చేశారు.
ఈ ఘటనపై ప్రభుత్వం, పోలీసు ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి నిజానిజాలను వెలుగులోకి తీసుకురావాలని, బాధ్యులను చట్టపరంగా శిక్షించాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు.