బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పీఆర్వో మహేష్ ముదిరాజ్, పీఏ మహేందర్‌పై పోలీస్‌స్టేషన్ సాక్షిగా దాడికి పాల్పడటాన్ని కల్లుగీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. పండగ రోజున విచారణ పేరుతో పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి ముసుగులు ధరించిన పోలీసులతో దాడికి ప్రయత్నించడం రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందనడానికి నిదర్శనమని ఆయన ఆరోపించారు.
కోర్టు ఆదేశాలను సైతం లెక్కచేయకుండా దౌర్జన్యం చేయించడం కోసమే కుట్రపూరితంగా కేటీఆర్ సిబ్బందిని విచారణకు పిలిపించారని పల్లె రవికుమార్ గౌడ్ విమర్శించారు. పోలీస్‌స్టేషన్‌లోని ఇంటరాగేషన్ రూమ్‌లోకి వెళ్లి మహేశ్, మహేందర్‌పై దాడికి ప్రయత్నించగా.. అక్కడే ఉన్న బీఆర్ఎస్ లీగల్ టీం సభ్యులు ఘటనను గమనించి కేకలు వేస్తూ అడ్డుకున్నారని ఆయన పేర్కొన్నారు. దీంతో ముసుగులు ధరించిన వ్యక్తులు అక్కడి నుంచి వెళ్లిపోయారని ఆరోపించారు.
పోలీస్‌స్టేషన్‌లో జరిగిన ఘటనకు సంబంధించిన పూర్తి సీసీటీవీ ఫుటేజ్‌ను వెంటనే బహిర్గతం చేయాలని పల్లె రవికుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. ముసుగులు ధరించి దాడికి యత్నించిన పోలీసులను గుర్తించి, వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి చట్ట ప్రకారం అరెస్ట్ చేయాలని కోరారు. పోలీస్ కస్టడీలో ఉన్న వ్యక్తులపై పోలీస్‌స్టేషన్‌లోనే దాడులు జరగడం రాష్ట్రంలో దిగజారుతున్న శాంతిభద్రతలకు అద్దం పడుతోందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నించే వారిపై దాడులకు పాల్పడటం ముమ్మాటికీ నయా రజాకార్ల పాలనను తలపిస్తోందని పల్లె రవికుమార్ గౌడ్ తీవ్రంగా విమర్శించారు.
కేటీఆర్ సిబ్బందిపై దాడికి యత్నించిన ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని, అలాంటి వారిపై దౌర్జన్యాలకు పాల్పడితే రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయంగా, ప్రజల పరంగా మూల్యం చెల్లించుకోక తప్పదని పల్లె రవికుమార్ గౌడ్ హెచ్చరించారు.