కట్టంగూర్, జూలై 30: కట్టంగూర్ తాసీల్దార్ కార్యాలయంలో సర్వర్ ఇబ్బందులు పెడుతుండటంతో ప్రతి రోజూ ఉదయాన్నే క్రయ విక్రయాల నిమిత్తం చేతిలో భూమి పత్రాలు, వెంట కుటుంబ సభ్యులతో వచ్చే క్రయ, విక్రయదారులు.. సాయంత్రం వరకు కార్యాలయ ప్రాంగణంలోనే వేచి ఉంటూ చివరికి సర్వర్ లేదు..రేపు రండి అనే మాటతో నిరాశగా వెనుదిరిగుతున్నారు. ఈ పరిస్థితి గత కొన్ని రోజులుగా కొనసాగుతుండడంతో భూముల రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కట్టంగూర్ తాసీల్దార్ కార్యాలయంలో సర్వర్ సమస్య కారణంగా రిజిస్ట్ట్రేషన్ సేవలు పూర్తిగా మందగించాయి. రోజుకు మూడు, నాలుగు రిజిస్ట్రేషన్లు కూడా పూర్తికాని పరిస్థితి నెలకొంది.రోజులు గడుస్తున్నా, కాళ్లరిగిలా తిరుగుతున్నా రిజిస్ట్రేషన్లు కాక జనం తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే రైతులు, మహిళలు, వృద్ధులు ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరీక్షిస్తున్నా పని కాకపోవడంతో ప్రయాణ ఖర్చులు, కూలి నష్టం భరిస్తూ తిరిగి వెళ్లిపోతున్నారు. ఇప్పటికే తేదీలు నిర్ణయించుకుని కొనుగోలు, అమ్మకందారులు కలిసి కార్యాలయానికి వచ్చినా సర్వర్ పని చేయడం లేదని సిబ్బంది చెప్పడంతో ఒప్పందాలు వాయిదా పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో ఎక్కడా లేని సర్వర్ సమస్య ఇక్కడే ఎం దుకు వస్తుందో అర్థం కావడం లేదని రైతులు వాపోతున్నారు. కొన్ని సందర్భాంల్లో తాసీల్దార్ పర్యటన కారణంగా మధ్యాహ్నం తర్వాతే కార్యాలయానికి రావడంతో మరింత సమ యం నిరీక్షించాల్సి వస్తోంది. ఒకవేళ సర్వర్ అందుబాటులోకి వచ్చినా సీరియల్ ప్రకారం కాకుండా డబ్బులు ఇచ్చిన వారి రిజిస్ట్రేషన్లను ముందుగా చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నా యి. సర్వర్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించి రిజిస్ట్రేషన్ సేవలు నిరంతరాయంగా అందుబాటులోకి తేవాలని జనం కొరుతున్నారు. ఈ విషయమై తాసీల్దార్ పుష్పలతను వివరణ కోరగా..మా సమస్యలు మాకుంటే ..మీరొచ్చి తలనొప్పి తెప్పిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సర్వర్ సమస్యతో ఇబ్బందులు..
సర్వర్ కారణంతో సకాలంలో రిజిస్ట్రేషన్లు కాకపోవడంతో కొనుగోలు, అమ్మకందారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన మహిళలు, వృద్ధులు రోజంతా కార్యాలయంలో పడిగాపులు కాస్తున్నారు. జిల్లాలో ఎక్కడా లేని సర్వర్ సమస్య ఇక్కడే ఎందుకు వస్తుందో అర్థం కావడం లేదు. సీరియల్ ప్రకారం కాకుండా ఇష్టానుసారంగా రిజిస్ట్రేషన్లు చేయడంతో సమస్య తలెత్తుతున్నది. కలెక్టర్ స్పందించి సర్వర్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించి రిజిస్ట్రేషన్ సేవలు అంతరాయం లేకుండా అందించాలి.
-నూక సైదులు, మాజీ పీఏసీఎస్ చైర్మన్