Asian Games : ఆసియా క్రీడల్లో భారత పురుషుల క్రికెట్ జట్టు (India’s Mens Cricket Team) మరోసారి స్వర్ణ పతకం (Gold Medal) సాధించింది. తన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ (Pakistan) తో జరిగిన ఫైనల్లో 19 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌లో అభిషేక్ శర్మ (61), తిలక్ వర్మ (51 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌లతో భారత్ 211 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం భారత బౌలర్లు సమష్టిగా రాణించడంతో పాకిస్థాన్ 192 పరుగులకే పరిమితమైంది. హసన్ నవాజ్ (96 నాటౌట్) ఒంటరిగా పోరాడినా పాకిస్థాన్‌ను విజయతీరాలకు చేర్చలేకపోయాడు.
టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్‌కు అభిషేక్ శర్మ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. పాకిస్థాన్ బౌలర్లపై విరుచుకుపడుతూ కేవలం 20 బంతుల్లోనే అర్ధశతకం పూర్తిచేశాడు. దాంతో పాక్‌పై టీ20ల్లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. గతంలో 2025లో దుబాయ్‌లో 24 బంతుల్లో సాధించిన తన రికార్డును తానే అధిగమించాడు. అభిషేక్ 28 బంతుల్లో 61 పరుగులు చేశాడు. అందులో మూడు ఫోర్లు, ఏడు సిక్సర్లు ఉన్నాయి.
ఆ తర్వాత తిలక్ వర్మ తనదైన శైలిలో చెలరేగిపోయి ఆడాడు. కేవలం 21 బంతుల్లోనే అర్ధశతకం సాధించాడు. శివమ్ దూబేతో కలిసి ఆరో వికెట్‌కు 62 పరుగులు జోడించాడు. దాంతో భారత్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. 212 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించేందుకు బరిలో దిగిన పాక్‌కు హసన్ నవాజ్ అండగా నిలిచాడు. భారత బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ 51 బంతుల్లోనే 96 పరుగులతో అజేయంగా నిలిచాడు.
సైమ్ అయూబ్ (29) మినహా మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించలేకపోయారు. భారత స్పిన్నర్లు వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ చెరో రెండు వికెట్లు తీసి పాక్ పరుగుల వేగానికి అడ్డుకట్ట వేశారు. చివర్లో శివమ్ దూబే కూడా రెండు వికెట్లు పడగొట్టడంతో పాక్ 20 ఓవర్లలో లక్ష్యానికి 19 పరుగుల దూరంలో ఆగిపోయింది. భారత్ ఘన విజయంతో స్వర్ణం దక్కించుకుంది. కాగా ఈ క్రీడల్లో ఇప్పటికే మహిళా క్రికెట్ జట్టుకు స్వర్ణం సాధించింది.