MK Stalin : తమిళనాడు సీఎం (Tamil Nadu CM) ఎంకే స్టాలిన్ (MK Stalin) మరోసారి కేంద్రం సర్కారుపై, అధికార బీజేపీ (BJP) పై మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర పాలనను చిక్కుల్లోకి నెడుతోందని, నిధుల్లో న్యాయబద్ధమైన వాటాను ఇచ్చేందుకు నిరాకరిస్తోందని ఆరోపించారు. తమిళనాడులోని రాజకీయాలన్నీ సామాజిక న్యాయానికి సంబంధించిన రాజకీయాలని, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తమిళనాడు అనేక రంగాల్లో ముందుందని అన్నారు. కేంద్ర-రాష్ట్ర సంబంధాలపై కలైవనర్ అరంగంలో శనివారంనాడు నిర్వహించిన జాతీయ సెమినార్లో స్టాలిన్ మాట్లాడారు.
కేంద్ర-రాష్ట్ర సంబంధాలపై తొలి జాతీయ సదస్సును తమిళనాడులో తాను ప్రారంభించడం సంతోషంగా ఉందని సీఎం స్టాలిన్ అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి అత్యధికంగా జీఎస్టీ ఆదాయం అందిస్తున్న రాష్ట్రాల్లో తమిళనాడు ఒకటని చెప్పారు. అయినప్పటికీ కేంద్రం సంకుచిత రాజకీయ ఉద్దేశాలతో తమిళనాడుకు న్యాయబద్ధంగా ఇవ్వాల్సిన నిధుల వాటాను ఇచ్చేందుకు నిరాకరిస్తోందన్నారు. తమిళనాడు, పశ్చిమబెంగాల్, పంజాబ్, కేరళ రాష్ట్రాలు బీజేపీ పాలనలో లేకపోవడంతో కేంద్రం పలు సమస్యలు, ఇబ్బందులు సృష్టిస్తోందని విమర్శించారు.
సమానత్వం, సామాజిక న్యాయం, మహిళా హక్కుల వంటి ఉన్నత సిద్ధాంతాల కోసం ద్రవిడ నేతలు అవిశ్రాంతంగా పనిచేస్తూ వచ్చారని, అన్నా, కలైనర్ ఇద్దరూ ప్రతిరంగంలోనూ ప్రజల అభ్యున్నతికి వివిధ కీలక పథకాలను అమలు చేశారని స్టాలిన్ గుర్తుచేశారు. కశ్మీర్ నుంచి రాష్ట్ర ప్రతిపత్తిని లాక్కోవడంపై విపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయని చెప్పారు. సర్కారియా కమిషన్ సైతం అధిక అధికార కేంద్రీకరణ వల్ల కేంద్రంపై ఆగ్రహం పెరుగుగుతుందని, రాష్ట్రాలు నిరాశా నిస్పృహలకు లోనవుతాయని చెప్పినట్టు స్టాలిన్ తెలిపారు.