Amer Fort : రాజస్థాన్ (Rajastan) రాష్ట్రాన్ని భారీ వర్షాలు (Heavy rains) కుదిపేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా అక్కడ ఎడతెరపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. శనివారం కూడా కుంభవృష్టి కురిసింది. జైపూర్ (Jaipur) లోని చారిత్రక అమెర్ ఫోర్ట్ (Amer Fort) కు చెందిన 200 అడుగుల పొడవైన గోడ కుప్పకూలింది. గోడలోని ప్రధాన భాగం వర్షాలకు కొట్టుకుపోయిన వీడియోను ఒక ప్రముఖ వార్తా సంస్థ షేర్ చేసింది.
VIDEO | Jaipur, Rajasthan: 200-feet long wall collapses in Amer Fort.
(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/71ctptxqd6
— Press Trust of India (@PTI_News) August 23, 2025
అదేవిధంగా రాజస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో ఎడతెగని వర్షాలు కురుస్తున్నాయి. దాంతో లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. వరదనీటితో రహదారులు నదుల్లా మారాయి. ఫలితంగా సామాన్య ప్రజాజీవనానికి తీవ్ర అంతరాయం కలుగుతోంది. కోట, బుండి, సవాయ్ మాధోపూర్, టోంక్‌లలో వరద నీరు భారీగా చేరింది. లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో రోడ్డు, రైల్ కనెక్టివిటీ కూడా దెబ్బతిన్నది.
బుండి, కోట, సవాయ్ మాధోపూర్, కరౌలి, జైపూర్లలో శనివారం ఉదయం 10 సెంటమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. దాంతో ఎక్కడికక్కడ జలదిగ్బంధం కొనసాగుతోంది. భిల్వారా, చిత్తోర్‌గఢ్‌లలో భారీ వర్షపాతం నమోదు కావడంతో రెడ్ అలర్ట్ జారీ చేశారు. బుండి, కోట, పాలి, రాజ్సమద్, ఉదయ్‌పూర్, డంగార్పూర్, బన్స్వారా, జలోర్, సిరోహిలో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు.