Woman died : ఆమె మద్యానికి బానిసైన భర్తతో వేగలేక అతడిని వదిలేసి పుట్టింటికి వెళ్లింది. అక్కడ తల్లికి భారం కాకూడదని భావించి ఉపాధి కోసం విదేశాలకు పోయింది. పరాయి దేశంలో రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. అక్కడ ఆమెకు నా అనేవారు లేకపోవడంతో అనాథ శవంగా మిలిగిపోయింది. ఆమె మరణించి దాదాపు ఐదేళ్లవుతున్నా స్పందించేవారు లేకపోవడంతో ఇన్నాళ్లు అంత్యక్రియలకు నోచుకోలేదు. కానీ చివరికి ఓ అజ్ఞాత వ్యక్తి సహకారంతో అంత్యక్రియలు పూర్తిచేశారు.
ఈ సమాచారాన్ని ఏపీలోని ఆమె తల్లికి తెలియజేశారు. దాంతో తన కుమార్తెను చివరి చూపు కూడా చూసుకోలేకపోయానని ఏలూరు జిల్లా కొయ్యలగూడేనికి చెందిన లంకా సత్యవతి ఆవేదన వ్యక్తంచేశారు. మృతురాలి తల్లి తెలిపిన వివరాల ప్రకారం.. ఆమె కుమార్తె కోరాడ సత్యవతి (37) 2020లో బహ్రెయిన్‌లో రోడ్డు ప్రమాదంలో మరణించింది. అప్పట్లో మృతదేహాన్ని తీసుకొచ్చే ఆర్థిక స్తోమత లేక అక్కడే వదిలేశారు. ఈ నెల 20న స్వచ్ఛంద సేవకుడి సహకారంతో మృతదేహానికి అంత్యక్రియలు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రవాస తెలుగు సంఘం నుంచి ఆమెకు సమాచారం అందింది.
కోరాడ సత్యవతిని తొలుత ఖతార్‌లో ఒకరింట్లో పని చేసేందుకు బంధువులు తీసుకెళ్లారని మృతురాలి తల్లి చెప్పింది. కొన్నాళ్ల తర్వాత వదిలేస్తే తానే డబ్బులు సమకూర్చి తన కుమార్తెను తీసుకొచ్చానని తెలిపింది. అనంతరం అల్లుడు తరచూ తన ఇంటికి వచ్చి హింసిస్తుంటే వేగలేక హైదరాబాద్వెళ్తున్నానని చెప్పి బహ్రెయిన్ వెళ్లిపోయిందని చెప్పింది. 2020లో ఆమె చనిపోయినట్లు సమాచారం వచ్చినప్పటి వరకు ఆమె అక్కడికి వెళ్లినట్లు తనకు తెలియదని తెలిపింది. తన వద్ద డబ్బులేక ఆమె శవాన్ని తీసుకురాలేకపోయానంది.