Sanjay Raut : ఆసియా కప్ (Asia Cup) లో భాగంగా భారత్ (India), పాకిస్థాన్ (Pakistan) దేశాల మధ్య క్రికెట్ (Cricket) మ్యాచ్‌ల నిర్వహణకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ (Sports ministry) అనుమతి ఇవ్వడంపై శివసేన (యూబీటీ) ఎంపీ (Shiv Sena (UBT) MP) సంజయ్ రౌత్ (Sanjay Raut) తీవ్రంగా స్పందించారు. పాకిస్థాన్‌తో క్రికెట్ ఆడాలన్న నిర్ణయం దేశ ప్రజలకు బాధ కలిగించే అంశమని, ఇది అమానుష చర్య అని ఆయన అభివర్ణించారు. ఈ మేరకు శనివారం ప్రధానమంత్రి (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) కి ఆయన ఒక లేఖ రాశారు.
‘పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన భారతీయుల రక్తం ఇంకా ఆరనేలేదు. వారి కుటుంబాల కన్నీళ్లు ఇంకిపోనేలేదు. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్థాన్‌తో క్రికెట్ ఆడటం మానవత్వం లేని చర్య’ అని సంజయ్ రౌత్ తన లేఖలో పేర్కొన్నారు. పాకిస్థాన్‌తో క్రికెట్ ఆడటం మన సైనికుల పరాక్రమాన్ని అవమానించడమే కాకుండా, కశ్మీర్ కోసం ప్రాణత్యాగం చేసిన శ్యామప్రసాద్ ముఖర్జీతో సహా ప్రతి అమరవీరుడిని అగౌరవపరచడమే అవుతుందని ఆయన విమర్శించారు.
ప్రధాన మంత్రి, హోంమంత్రిత్వ శాఖ అనుమతి లేకుండా క్రీడా మంత్రిత్వ శాఖ ఇంత పెద్ద నిర్ణయం తీసుకోలేదని సంజయ్ రౌత్ తన లేఖలో పేర్కొన్నారు. దేశభక్తి కలిగిన పౌరుల మనోభావాలనే తాను ఈ లేఖలో వ్యక్తపరుస్తున్నానని తెలిపారు. భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌లు దుబాయ్‌లో జరుగుతున్నాయని, ఒకవేళ మహారాష్ట్రలో జరిగి ఉంటే బాలాసాహెబ్ ఠాక్రే శివసేన వాటిని అడ్డుకుని ఉండేదని అన్నారు. కేంద్రం హిందుత్వం, దేశభక్తి కంటే పాకిస్థాన్‌తో క్రికెట్‌కే ప్రాధాన్యం ఇస్తూ దేశ ప్రజల మనోభావాలను కాలరాస్తున్నదని మండిపడ్డారు.
కేంద్రం నిర్ణయాన్ని శివసేన (యూబీటీ) తీవ్రంగా ఖండిస్తోందని రౌత్ స్పష్టం చేశారు. పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌ల వెనుక భారీ ఎత్తున బెట్టింగ్, ఆన్లైన్ జూదం జరుగుతోందని, ఇందులో చాలామంది బీజేపీ సభ్యుల ప్రమేయం కూడా ఉందని రౌత్ ఆరోపించారు. ‘గుజరాత్‌కు చెందిన ప్రముఖ వ్యక్తి జై షా ప్రస్తుతం క్రికెట్ వ్యవహారాలను నడిపిస్తున్నారు. దీని వెనుక బీజేపీకి ఏమైనా ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయా..?’ అని ఆయన క్వశ్చన్ చేశారు. ‘ఒకప్పుడు రక్తం, నీళ్లు కలిసి ప్రవహించవు అని మీరే అన్నారు. మరి ఇప్పుడు రక్తం, క్రికెట్ కలిసి ప్రవహిస్తున్నాయా..?’ అని ప్రశ్నించారు.
‘పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడింది పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థే. ఆ దాడి 26 మంది మహిళల నుదుటి సిందూరాన్ని చెరిపేసింది. ఆ తల్లులు, సోదరీమణుల ఆవేదనను మీరు పరిగణనలోకి తీసుకున్నారా..?’ అని రౌత్ తన లేఖలో ప్రధానికి ప్రశ్న వేశారు.