Sudershan Reddy : ప్రతిపక్ష పార్టీల తరఫున ఉపరాష్ట్రపతి ఎన్నికల బరిలో ఉన్న జస్టిస్ బీ సుదర్శన్ రెడ్డి (Justice B Sudershan Reddy) నక్సలిజానికి అనుకూలంగా తీర్పులిచ్చారని కేంద్ర హోంమంత్రి (Union Home Minister) అమిత్ షా (Amit Shah) చేసిన విమర్శలపై ఆయన స్పందించారు. భారత రాజ్యాంగం (Indian Constitution) కూడా సవాళ్లను ఎదుర్కొంటున్నదని, దేశ ప్రజాస్వామ్యం (Democracy) లో లోటు కనిపిస్తున్నదని వ్యాఖ్యానించారు. సల్వాజుడుంపై ఇచ్చినది తన సొంత తీర్పు కాదని, అది సుప్రీంకోర్టు (Supreme Court) తీర్పు అని చెప్పారు. విపక్షాలు తనను ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేయడాన్ని గౌరవంగా భావిస్తున్నానని అన్నారు.
సల్వా జుడుం తీర్పుపై తాను కేంద్ర హోంమంత్రితో నేరుగా చర్చకు దిగాలని అనుకోవడం లేదని అన్నారు. గతంలో ఆ తీర్పును తానే రాశానని, కానీ అది నా సొంత తీర్పు కాదని, సుప్రీంకోర్టు తీర్పు అని చెప్పారు. 40 పేజీల ఆ తీర్పును అమిత్ షా చదవాలని ఆశిస్తున్నానని, ఒకవేళ ఆయన తీర్పు చదివి ఉంటే అలాంటి వ్యాఖ్యలు చేసేవారు కాదని వ్యాఖ్యానించారు. తాను చెప్పదలుచుకున్నది ఇంతేనని, ఈ చర్చను ఇంతటితో ఆపేద్దామని అన్నారు. కులగణనపై మాట్లాడుతూ.. సామాజిక, ఆర్థిక విధానాల రూపకల్పన కోసం కులగణన చేపట్టాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు.
ఉపరాష్ట్రపతి ఎన్నిక అనేది ఇద్దరు అభ్యర్థుల మధ్య పోటీ కాదని, రెండు భావ జాలాల మధ్య పోటీ అని జస్టిస్ సుదర్శన్‌రెడ్డి అన్నారు. ప్రజాస్వామ్యం అంటే పరస్పర చర్చ మాత్రమేనని, వ్యక్తులు, వారి ఆలోచనల మధ్య సంఘర్షణ కాదని చెప్పారు. జాతీయ అంశాలపై గతంలో అధికార, విపక్ష పార్టీలు సమన్వయం చేసుకునేవని, దురదృష్టవశాత్తు ఇప్పుడది కనిపించడంలేదని అన్నారు. పార్లమెంట్ కార్యకలాపాలకు సభ్యులు అప్పుడప్పుడు అంతరాయం కలిగించడం కూడా ఒక విధమైన నిరసన మాత్రమేనని, అయితే ప్రజాస్వామ్య ప్రక్రియలో అది అంతర్భాగంగా మారకూడదని అభిప్రాయపడ్డారు.
ఒకప్పుడు లోటు ఆర్థిక వ్యవస్థ గురించి చర్చ జరిగేదని, ఇప్పుడు లోటు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుకుంటున్నామని అన్నారు. అయితే భారత్ ప్రజాస్వామ్య దేశం కాదని తాను అనడంలేదని, ఇప్పటికీ మనది రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యమేనని చెప్పారు. అయితే ప్రస్తుతం ప్రజాస్వామ్యం ఒత్తిడికి గురవుతోందని భావిస్తున్నామని వ్యాఖ్యానించారు.