S Jaishankar : భారత్ – పాకిస్థాన్ (India-Pakistan) దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు తాము మధ్యవర్తిత్వం చేశామంటూ అమెరికా అధ్యక్షుడు (US president) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చేసిన వ్యాఖ్యలను భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ (S Jaishankar) తీవ్రంగా ఖండించారు. పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక సంబంధాల్లో మూడో దేశం జోక్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని ఆయన స్పష్టంచేశారు.
ఢిల్లీలో జరిగిన ‘ఎకనామిక్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరమ్ 2025’ సదస్సులో జైశంకర్ మాట్లాడుతూ.. ఈ ఏడాది మే నెలలో భారత్-పాక్ మధ్య నాలుగు రోజులపాటు నెలకొన్న ఉద్రిక్తతల సమయంలో అమెరికా జోక్యం చేసుకుని సయోధ్య కుదిర్చిందని ట్రంప్ పదేపదే చెబుతున్న మాటల్లో నిజం లేదని అన్నారు. ‘పాకిస్థాన్‌తో మా సంబంధాల్లో మధ్యవర్తిత్వాన్ని మేం అంగీకరించబోమని 1970 నుంచి అంటే దాదాపు 50 ఏళ్లుగా దేశంలో ఒక జాతీయ ఏకాభిప్రాయం ఉంది’ అని జైశంకర్ అన్నారు.
భద్రత, ఆర్థిక సహకారం వంటి రంగాల్లో అమెరికా-పాకిస్థాన్ సంబంధాలు మళ్లీ బలపడుతున్న తరుణంలో జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవలి కాలంలో పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ రెండుసార్లు అమెరికాలో పర్యటించారు. ఈ పర్యటనల్లో వాణిజ్యం, ఆర్థికాభివృద్ధి, క్రిప్టోకరెన్సీ నిబంధనల వంటి అంశాలపై చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో జైశంకర్ దేశ ప్రయోజనాల విషయంలో తమ ప్రభుత్వ వైఖరిని కూడా స్పష్టం చేశారు.
‘రైతుల ప్రయోజనాలు, దేశ వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి, మధ్యవర్తిత్వ వ్యతిరేకత వంటి అంశాల్లో ఈ ప్రభుత్వం చాలా నిక్కచ్చిగా ఉంది’ అని ఎస్ జైశంకర్ అన్నారు. తమ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే వారు ఆ విషయాన్ని భారత ప్రజలకు ధైర్యంగా చెప్పాలని సవాల్ విసిరారు. ‘రైతుల ప్రయోజనాలను కాపాడటానికి మీరు సిద్ధంగా లేరని ప్రజలకు చెప్పండి. వ్యూహాత్మక స్వయంప్రతిపత్తికి మీరు విలువ ఇవ్వడంలేదని చెప్పండి. మేం మాత్రం వీటికి కట్టుబడి ఉంటాం. వాటిని కాపాడుకోవడానికి ఏం చేయాలో అది చేస్తాం’ అని జైశంకర్ గట్టిగానే అన్నారు.