Anurag Kashyap | ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘ఎప్స్టీన్ ఫైల్స్’ వివాదంలో తన పేరు వినిపించడంపై ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తీవ్రంగా స్పందించారు. అమెరికన్ బిలియనీర్ జెఫ్రీ ఎప్స్టీన్ లైంగిక అక్రమ రవాణా కేసులో బయటపడిన పత్రాలలో తన పేరు ఉందంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన పూర్తిగా తోసిపుచ్చాడు. తనకు ఆ ఫైల్స్‌తో కానీ, అందులో ఉన్న ఈమెయిల్స్‌తో కానీ ఎటువంటి సంబంధం లేదని అనుగార్ క్లారిటీ ఇచ్చాడు. 2017లో ఎప్స్టీన్ నిర్వహించిన ఒక ఈవెంట్ కోసం తాను బీజింగ్ వెళ్లాననే వార్తల్లో నిజం లేదని, అసలు తన జీవితంలో ఇప్పటివరకు బీజింగ్నే సందర్శించలేదని అనురాగ్ అన్నారు. 2014 కంటే ముందు కేవలం సినిమా లొకేషన్ల కోసం ఒక్కసారి మాత్రమే చైనా వెళ్లానని, అది కూడా శంఘైకి మాత్రమేనని వివరించారు. ఒక వక్తగా తనకు అనేక ఆహ్వానాలు వస్తుంటాయని, అంతమాత్రాన ఆ ఈవెంట్లతో తనకు సంబంధం ఉన్నట్లు కాదని ఆయన పేర్కొన్నారు. తన సినిమాల కంటే ఇలాంటి అనవసర పుకార్ల ద్వారానే తన పేరు ఎక్కువగా చర్చకు రావడంపై ఆయన అసహనం వ్యక్తం చేస్తూ, కేవలం ఏదో ఒక ఈమెయిల్లో పేరు కనిపించినంత మాత్రాన నిందలు వేయడం సరికాదని కొట్టిపారేశారు.
అసలు ఏంటి ‘ఎప్స్టీన్ ఫైల్స్’?
అమెరికన్ బిలియనీర్ జెఫ్రీ ఎప్స్టీన్ మైనర్ బాలికలను ట్రాప్ చేసి, ఒక భారీ లైంగిక అక్రమ రవాణా నెట్‌వర్క్‌ను నడిపిన వ్యవహారానికి సంబంధించిన కీలక పత్రాలనే ‘ఎప్స్టీన్ ఫైల్స్’ అంటారు. ప్రపంచ దేశాల అధ్యక్షులు, వ్యాపారవేత్తలు, మరియు సినీ ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు కలిగిన ఎప్స్టీన్, 2019లో అరెస్టయి జైలులోనే అనుమానాస్పదంగా మరణించారు. ఇటీవల అమెరికా కోర్టు బహిర్గతం చేసిన సుమారు 900 పేజీల ఈ పత్రాల్లో ఎప్స్టీన్ ప్రైవేట్ ద్వీపానికి వెళ్లిన వారు, ఆయన విమానాల్లో ప్రయాణించిన ప్రముఖుల పేర్లు, కాల్ రికార్డులు మరియు బాధితుల సాక్ష్యాలు ఉన్నాయి. ఈ జాబితాలో బిల్ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్, బ్రిటన్ ప్రిన్స్ ఆండ్రూ వంటి అగ్రనేతల పేర్లు ప్రస్తావనకు రావడంతో అంతర్జాతీయంగా సంచలనం రేగింది. ఈ ఫైల్స్‌లో పేరు ఉన్నంత మాత్రాన వారంతా నేరస్తులు కాకపోయినా, ఎప్స్టీన్ నడిపిన చీకటి సామ్రాజ్యంతో ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయనే చేదు నిజాలు ఈ పత్రాల ద్వారా బయటపడుతున్నాయి.