ప్రస్తుత కాలంలో ఆయన లాంటి వ్యక్తులు మిక్కిలి అరుదుగా ఉంటారు. పాంచభౌతికతత్త్వాన్ని త్రికరణశుద్ధిగా అనుభవైకవేద్యం చేసుకున్న సుప్రసన్నాచార్యులు అటువంటి తన్మయస్థితిని పరానుభూతం చేయడానికి సంకల్పించి, దానికి అక్షర రూపాన్ని కల్పించడం మన సుహృద్భాగ్యం.
విశ్వాంతరాళంలో ఉన్న అదృశ్య శక్తిని అన్వేషించి, దృశ్యమానం చేసుకొని, విశ్వంతో మమేకమై విశ్వలయను అనుభూతి చెందిన మహామనీషి కోవెల సుప్రసన్నాచార్యులు. అందరిలో ఆ భావనను ఆపేక్షించి సమాజాన్ని జాగృతం చేయడానికి, విశ్వరూప సౌందర్యాన్ని దర్శింపజేయడానికి ఆయన పడిన తపన వర్ణనాతీతం.
ఒకవైపు విశ్వ శ్రేయస్సును కాంక్షిస్తూనే, మరోవైపు కావ్య సౌందర్యపు పచ్చ కర్పూరపు గుబాళింపులను పంచుతూనే తనలో తనను వెతుక్కున్నారాయన. భౌతికతత్త్వం నుంచి అనంతతత్త్వం వైపు మానవుని గమనాన్ని పరిశోధించారు. జాగ్రత్, స్వప్న, సుషుప్తులనే అవస్థాత్రయాన్ని అధిగమించి అలౌకికానంద విహాయసంలో విహరించి పరవశులయ్యారు. ఆ సుధార్ణవంలో నిలువునా మునిగి మహోన్నత తీరాలను చేరుకున్నారు.
ప్రాచీన సాహితీ సంపదను ఒడిసిపట్టిన కవిగా, రచయితగా, విమర్శకుడిగా ఉదాత్తమైన వ్యక్తిత్వంతో, విలక్షణాభివ్యక్తితో, కవిత్వ స్వరూప స్వభావాలను చిత్రించిన విద్వత్సంపన్నుడు ఆయన. నిశితకావ్య పరిశీలనా వివేచనంతో మారుతున్న సమాజ పరిస్థితులకు అనుగుణంగా ప్రాచీన సాహిత్యానికి, ఆధునిక సాహిత్యానికి వారధిలా నిలిచి విశ్వజనీనతను వాంఛించారు. కాలక్రమంలో కవిత్వ రంగంలో ఏర్పడిన అసంతులితను అవగతం చేసుకొని వర్తమాన కవితను విస్పష్టంగా, విశిష్టంగా, విభిన్నంగా ప్రయోగించి అపురూప కవిత్వ విన్యాసం చేశారు.
బహుముఖీనంగా సాగిన ఆయన రచన అనేకులకు మార్గప్రబోధం చేసింది. ఆదర్శవంతులుగా తీర్చింది. ప్రసన్నాంతరంగులైన ఆయన నామధేయాన్ని సాహిత్యరంగంలో మేరుశిఖరంపై నిలబెట్టింది. ఉత్తమ కవితా ప్రమాణాల కోసం తమ వంతు ప్రయత్నం చేసిన చేతనావర్త కవుల్లో ఒకరుగా, ఆధునికాంధ్ర సాహిత్యంలో విమర్శకుడిగా నిరూపమాన నిర్మాణ కౌశలురై యశోభూషణులైన ఆయన సాహితీ మధువు తొమ్మిది దశాబ్దాల వయసులోనూ ఇంకా నిరంతరంగా, నిరాఘాటంగా, నిరవధికంగా సాగుతున్నదంటే అది ఆయన పట్టుదలకు, సాహిత్యానురక్తికి, తెలుగు భాషాభినివేశానికి నిదర్శనం.
‘ప్రతి రక్తపు బిందువున పగులబడు నావేశ
మిదె తెన్గు జాతి తన యెదయెల్ల విచ్చినది
నా జాతి విశ్వ నీరద చంచలాలతిక
నా భాష జీవ సంతాన సత్త్వ పతాక’
తెలుగు జాతిని, భాషను గగనతల సింహాసనంపై అధివసింపజేసిన మహోత్తర కవి ఆయన. సాంప్రదాయ కుటుంబంలో పుట్టినా ఆ పరిమితులకే లోబడక ఆధునిక భావజాలంతో సామాజిక దృక్పథం కలిగిన కవిగా విస్తరించారు. ఈనాటి సమాజ సంక్షోభానికి కారణం భౌతిక సుఖాలనందించే సౌకర్యాలేనని, మానవుడే పర్యావరణాన్ని అసంతులనం చేస్తున్నాడని, చివరకు ‘పృథ్వి దినోత్సవాల’లో మునిగి పచ్చదనం కోసం కన్నీరు కార్చే దయనీయస్థితిలో ఉన్నామని ఆవేదన చెందుతారు. ‘మేధావి’ తోలు కప్పుకున్న మానవుని అత్యాశ మరింతగా పెరుగుతుండడం శోచనీయం అని అంటారాయన.
1936 మార్చి 17వ తేదీన వరంగల్ పట్టణంలో పండిత కుటుంబంలో జన్మించిన సుప్రసన్నాచార్యులు పారంపర్యంగా వచ్చిన ఆ సాహితీ మాధుర్యాన్ని తనివితీరా ఆస్వాదించారు. భారత, భాగవత, రామాయణ కావ్యాల్లోని అంతర్లీన సౌందర్యాన్ని ఆకళింపు చేసుకొన్నారు. ప్రాథమిక విద్యార్థి దశలోనే ఉపనిషత్తులు, ఉభయ వేదాంత గ్రంథాలు, భగవద్గీత వంటి గ్రంథాలు చదివిన ప్రభావంతో తనను తాను శిల్పంగా చెక్కుకొని ఉదాత్త వ్యక్తిత్వాన్ని ఏర్పరచుకున్నారు. ఆయన బాల్యమంతా స్వాతంత్య్ర సంగ్రామ కల్లోల వాతావరణంలో గడిచింది.
వర్ణభేదాలకు అతీతంగా భగవంతుని చేరుకొనే దిశగా ఆయనలో నూతనమైన ఆలోచన స్ఫురించింది. ఆ భావాలకు అనుగుణంగా ప్రాచీనతను పొదువుకొంటూనే ఆధునిక సమాజం వైపు ఆయన దృష్టి సారించారు. చిన్నాన్న కోవెల సంపత్కుమారాచార్యతో కలిసి సాహిత్యపథంలో నడిచారు. జంటకవులుగా పేరు తెచ్చుకొన్నారు. 1954లోనే ‘తెలుగు స్వతంత్ర’ పత్రికలో ఆయన వచన పద్యాలు అచ్చయ్యాయి.
సద్గురు శివానందమూర్తి వారి భావలోకంలో ఆయన తన్మయులయ్యారు. అరవిందుల తత్త్వంతో అంతస్సులోకి ప్రవేశించారు. విశ్వనాథ వారి సాహిత్యసీమలో విహరించారు. ఈ ముగ్గురి భావాలు ముప్పేటలుగా అల్లుకొని ఆయన జీవితాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాయి.
‘విశ్వనాథ మార్గాన్ని అనుసరించినా, ఆయనకున్న ప్రత్యేకతలను ఎవరూ కాదనలేరు’ అని చేకూరి రామారావు ఆయనను ప్రశంసించారు. ఇప్పటివరకు యాభైకి పైగా వివిధ ప్రక్రియల్లో సాగిన ఆయన రచనాశైలి అసామాన్యం. ‘శతాంకుర’లో కలువరేకులై విచ్చుకుంటారు. ‘ఋతంభర’లో దేశభక్తిని, సామాజిక చైతన్యాన్ని పులుముకుంటారు. ‘హృద్గీత’ను ఆలపించి మనోనిశ్చలురవుతారు. ‘కన్నీటి కొలను’తో మానవజీవన సంఘర్షణలకు దుఃఖిస్తారు. ‘శేఫాలిక’తో అంతర్ముఖ జగత్తులో లీనమవుతారు. ‘సాంపరాయం’లో దివ్యమైన సమాజాన్ని స్వప్నిస్తారు.
‘అనుభవములివి కవి చిత్తమవధి లేని
విశ్వ చేతన కూడిన పర్విన క్షణాలు..
ఏమి మిగులును, బ్రతుకునకెప్పుడైన’
అంటూ ‘పరిక్రమ’లో విషాదమేఘాలు కమ్మిన జీవితానికి విలపిస్తారు. కవికి వ్యక్తిగతం, కావ్యం రెండూ విడదీయరానివి. సమాజస్థితికి కలవరపడ్డా, తన జీవనస్థితికి కల్లోలిత మనస్కుడైనా హృదయం సంద్రమవుతుంది. భావం ఉప్పొంగి కలం అక్షరాల్లో ప్రవహిస్తుంది. విశ్వనాథుల మాదిరిగా ఒంటరితనాన్ని అనుభవించలేక గుణాతీత జగత్తులో ప్రవేశించడానికి కావ్య సాధన చేశారు. పరమేశ్వరునితో అనుసంధానం చేసుకోవడానికి ‘శివాభిసారిక’తో మధురభక్తి తత్పరులయ్యారు. అనంతమైన మృత్యుతత్త్వానికి ప్రతీకగా తమ దుఃఖాన్ని వ్యక్తీకరిస్తూ ‘మణికర్ణిక’గా అవతరించారు. అక్కడితో ఆగక ‘అశ్రుభోగ’గా ప్రపంచ దుఃఖాన్ని పరిచయం చేశారు.
ఆయన విరచించిన వివిధ భక్తి శతకాలు, శ్రీ నిరుక్తి, మణి సేతువు, ప్రీతి పుష్కరిణి, వేదసూక్త సౌరభం, శ్రీకృష్ణోపనిషత్తు, కృష్ణరశ్మి మొదలైన రచనలు పారమార్థిక, తాత్త్విక పరంపరలై కొనసాగాయి. సహృదయ చక్రం, భావుకసీమ, చందన శాఖి, దర్పణం, సమర్పణ, సమర్చన, భావసంధ్య వంటి విమర్శన గ్రంథాలు తరువాతి తరాలకు విమర్శ మార్గాన్ని దర్శింపజేస్తాయి. ఆయన రచనలు సమకాలీనం, సార్వకాలీనాలై ఉదార వ్యక్తిత్వ రూపకల్పనకు దోహదం చేస్తాయి.
సాహిత్య చరిత్ర నిర్మాణం ఎప్పటికప్పుడు కొత్తగా చేరుస్తూ, మారుస్తూ, పునరాలోచన చేస్తూ పోవాల్సిన అంశమని, ఏ బిందువు దగ్గరా ఆగిపోకూడదని అంటారాయన. 90వ ఏట అడుగుపెట్టినా ఇప్పటికీ సాహిత్యమే శ్వాసగా జీవిస్తున్న మహానుభావుడు సుప్రసన్నాచార్యులు. ఆయన వల్ల ప్రభావితులైన ఎంతోమంది ఆ సాహితీ వటవృక్షాన్ని విస్తరింపజేసేందుకు తమవంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ‘విజ్ఞానం విస్తృతమవుతూ అనేక పరిణామాలు చోటుచేసుకుంటున్నప్పటికీ కవులు, రచయితలు తమ బాధ్యతనెరిగి రచనలు చేయాలి’ అని చెప్పిన కోవెల వారి మాటలు అన్ని తరాలవారికి మార్గదర్శకాలు. ఈ సందర్భంగా సుప్రసన్నకు సంపూర్ణ ఆయురారోగ్యాలు కలుగాలని శుభాకాంక్షలు తెలుపుతున్నాను.