BRS Walkout | పోలీసులు, ఆర్టీసీ, బీసీ సంక్షేమంపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు. అంతకుముందు హరీశ్‌రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. వడ్డించేవాడు మనవాడు అయితే ఎక్కడున్నా లడ్డూ వస్తుందని అంటారు.. కానీ ముఖ్యమంత్రి వద్దనే పోలీసు శాఖ ఉన్నప్పటికీ ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులను అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు.
రాత్రింబవళ్లు కష్టపడే వారు పోలీసులు అని.. రాష్ట్రం కోసం సమాజం పనిచేస్తున్నారని హరీశ్‌రావు తెలిపారు. పోలీసులను కేసీఆర్ ఎంతగానో గౌరవించారని అన్నారు. 40, 50 పోస్టులను భర్తీ చేశారని తెలిపారు. కొత్త కమిషనరేట్లను ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసుల సంక్షేమంపై తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుందని మండిపడ్డారు. కొన్ని జిల్లాలకు మాత్రమే టీఏలు, డీఏలు ఇస్తున్నారని తెలిపారు. ఏడు టీఏ బిల్లులు, మూడు సరెండర్ లీవులు, ఐదు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. పోలీసుల భద్రత పథకాన్ని ఒక లక్షకు మాత్రమే పరిమితం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోలీసు శాఖలో ప్రమోషన్లను పక్కనబెట్టారని హరీశ్‌రావు తెలిపారు. పోలీసులకు ఈహెచ్ఎస్ను ఇంప్లిమెంట్ చేస్తలేరని పేర్కొన్నారు. 2024 తర్వాత ఇప్పటివరకు పోలీస్ రిక్రూట్మెంట్ చేపట్టలేదని అన్నారు. అభ్యర్థులు నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. గత సంవత్సరం కంటే 400 కోట్ల బడ్జెట్‌ను ఎందుకు తగ్గించారని హరీశ్‌రావు ప్రశ్నించారు. పెంచాల్సిన బడ్జెట్ ఎందుకు తగ్గిందని నిలదీశారు. మా ప్రశ్నలకు మంత్రి నుంచి ఎలాంటి అస్యూరెన్స్ లేదని మండిపడ్డారు. అలాగే ఆర్టీసీ ఉద్యోగులకు , కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని హరీశ్‌రావు అన్నారు.
పోలీసుల టీఏలు, డీఏలు, సరెండర్ లీవులు విడుదల చేయనందుకు నిరసనగా, పోలీసుల ఆరోగ్య భద్రతా పథకంపై భరోసా ఇవ్వనందుకు నిరసనగా, పోలీసు శాఖలో ఉన్న 17వేల ఖాళీల భర్తీపై సమాధానం చెప్పనందుకు నిరసనగా, పోలీసులకు కొత్త వాహనాల విషయంలో సమాధానం చెప్పనందుకు నిరసనగా, బీసీల ఆత్మగౌరవ విషయంలో స్పష్టత ఇవ్వనందుకు నిరసనగా, బీసీ సబ్ ప్లాన్ నిదుల కేటాయింపుపై వైఖరి చెప్పనందుకు నిరసనగా, ప్రభుత్వ ఉద్యోగులుగా ఆర్టీసీ ఉద్యోగుల అపాయింటెడ్ డేట్ చెప్పనందుకు నిరసనగా వాకౌట్ చేస్తున్నామని ప్రకటించారు.