Oscars 2029 | ప్రపంచ చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘అకాడమీ అవార్డ్స్’ (ఆస్కార్) ఒక చారిత్రాత్మక మార్పుకు సిద్ధమవుతోంది. దశాబ్దాలుగా హాలీవుడ్ వేదికగా జరుగుతున్న ఈ వేడుకలు, 2029 నుంచి లాస్ ఏంజిల్స్ డౌన్‌టౌన్‌లోని కొత్త వేదికకు మారనున్నాయి.
అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ప్రకటించిన వివరాల ప్రకారం, 2029 నుంచి 2039 వరకు పదేళ్ల పాటు ఈ వేడుకలు లాస్ ఏంజిల్స్ లైవ్ కాంప్లెక్స్‌లోని ‘పీకాక్ థియేటర్’లో జరగనున్నాయి. ఇందుకోసం ప్రముఖ వినోద సంస్థ ‘AEG’తో అకాడమీ ఒప్పందం కుదుర్చుకుంది. 2001 నుంచి ఆస్కార్ వేడుకలకు ఆతిథ్యం ఇస్తున్న హాలీవుడ్ బౌలేవార్డ్ లోని ‘డాల్బీ థియేటర్’ యుగం, 2028లో జరగబోయే 100వ వార్షికోత్సవ వేడుకలతో ముగియనుంది. అప్పటివరకు ఈ వేడుకలు ఎబిసి (ABC) ఛానల్లోనే ప్రసారమవుతాయి. అయితే, 2029 నుంచి 2033 వరకు జరిగే ఆస్కార్ వేడుకల ప్రసార హక్కులను యూట్యూబ్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. దీనివల్ల రెడ్ కార్పెట్, తెరవెనుక విశేషాలు మరియు ప్రధాన వేడుక వంటివన్నీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా అభిమానులు యూట్యూబ్‌లో ఉచితంగా వీక్షించే అవకాశం కలగనుంది. అత్యాధునిక సాంకేతికత కలిగిన వేదికపై సినిమా పండుగను ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవడానికి ఈ మార్పు ఎంతో దోహదపడుతుందని అకాడమీ ప్రతినిధులు పేర్కొన్నారు.