కాంగ్రెస్ రెండేండ్ల పాలన నగరాభివృద్ధికి శాపంగా మారింది. ప్రాజెక్టుల పేరిట వివాదాలను తెరమీదకు తీసుకు రావడమే తప్ప.. ఒక్క ప్రాజెక్టునూ చేపట్టలేని కాంగ్రెస్ సర్కార్ విశ్వనగర ఖ్యాతి, స్ఫూర్తిని నీరుగారిపోయేలా చేస్తున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే చేపట్టిన ఎలివేటెడ్ కారిడార్ నుంచి మొదలుకుని, హైడ్రా కూల్చివేతలు, అడ్డగోలుగా జరిగిన శివారు మున్సిపాలిటీల విలీనం, అస్తవ్యస్తంగా జరిగిన జీహెచ్ఎంసీ విభజన, మెట్రో టేకోవర్, మూసీ పరిరక్షణ పేరిట లక్షన్నర కోట్ల భూములపై గురి పెట్టిన ప్రణాళికలన్నీ సర్కారు వైఫల్యాలను తేటతెల్లం చేస్తున్నాయి. నేటి నుంచి జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో నగరాభివృద్ధిలో కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. ముఖ్యంగా మూసీ విధ్వంసం ప్రధాన చర్చానీయాంశంగా మారనున్నది.
-సిటీబ్యూరో, మార్చి 15(నమస్తేతెలంగాణ)

Assembly
3300 ఎకరాలు కట్టబెట్టేందుకు..
కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన మూసీ నది పునరుజ్జీవం ప్రాజెక్టుపై చర్చకు పట్టుపట్టేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతున్నది. వేలాది మంది ప్రజల ఇండ్లను కూల్చి మూసీ పరీవాహకంలోని 3300 ఎకరాల భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కట్టబెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుండటంపై బీఆర్ఎస్ నిలదీయనున్నది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మూసీపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పేరిట ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపించారు. ఫైవ్ స్టార్ హోటల్లో సమావేశం ఏర్పాటు చేసి.. ఏఐ చిత్రాలు, గ్రాఫిక్ మాయాజాలం కనికట్టుతో ప్రజలను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించారు. మూసీ పొడవునా ప్రజల ఇండ్లను కూల్చి ఆకాశహర్మ్యాలను నిర్మించేందుకు రియల్ ఎస్టేట్ వ్యాపారమే పరమావధిగా ప్రాజెక్టును చేపట్టనున్నట్లు తేల్చేశారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం చూపించిన గ్రాఫిక్ మాయాజాలాన్ని హిమాయత్‌సాగర్ ఒడ్డున ప్రజల మధ్యన ఎండగట్టారు. మూసీ సుందరీకరణకు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేపట్టిన ప్రతిపాదనలు, పనులను ప్రజల ముందుంచారు. ఒక్క ఇల్లును కూల్చకుండా ఒక్క గుంట ప్రజల భూమిని లాక్కోకుండా మూసీ మురుగును ఎలా పారదోలవచ్చో గత ప్రభుత్వంలో కేసీఆర్ ఎలాంటి విధానాన్ని చేపట్టారో సజీవ చిత్రాలతో కేటీఆర్ ప్రజలకు కండ్లకు కట్టేలా చూపించారు. కేవలం రూ.16 వేల కోట్లతో మూసీ మురుగును వెల్లగొట్టి.. ప్రపంచ స్థాయి నిర్మాణాలను మూసీ ఒడ్డున ఎలా చేపట్టవచ్చో చెప్పారు. ప్రాజెక్టులో భాగంగా నాగోల్ ప్రాంతంలో పైలెట్ ప్రాజెక్టు కింద చేపట్టిన సుందరీకరణను ఉదహరించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ సుందరీకరణను రియల్ ఎస్టేట్ వ్యాపారంగా.. మూసీ పరీవాహకంలో ఉన్న 3300 ఎకరాల భూములను ల్యాండ్ బ్యాంకుగా చేసుకుని రూ.లక్షన్నర కోట్ల కుంభకోణానికి తెరలేపుతున్నారని.. రేవంత్‌రెడ్డి కుట్రను భగ్నం చేశారు.

మూసీ అంశం కీలకంగా..
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి ప్రధాన చర్చాంశంగా మారనున్నది. ఇందులో లక్షలాది మంది పేదలను రోడ్డున పడేసేలా కాంగ్రెస్ సర్కార్ చేపట్టిన మూసీ పునర్జీవం కీలకం కానుండగా, ఆర్థిక లోటుతో కొట్టుమిట్టాడుతున్న రాష్ర్టానికి మెట్రో టేకోవర్ గుదిబండగా మార్చుతున్నది. ఇక రెండేండ్లు గడిచినా పూర్తి గానీ ఎలివేటెడ్, ఓల్డ్ సిటీ మెట్రో భూసేకరణతోపాటు, వివాదాస్పదంగా మారిన కాంగ్రెస్ ప్రకటించిన ప్రాజెక్టుల పురోగతిపై చర్చకు వచ్చే అవకాశం ఉంది.
ఇప్పటికే లక్షన్నర కోట్లు భూముల కోసమే మూసీ పునర్జీవం అంటూ కాంగ్రెస్ అవినీతిని బీఆర్ఎస్ ఎండగడుతుండగా, మెట్రో రెండో దశ అనుమతుల్లో సర్కార్‌ను కార్నర్ చేసే అవకాశం ఉంది. విశ్వనగరానికి కీలకంగా మారిన అభివృద్ధి విషయంలో కేవలం కూల్చివేతలు, భూములపై గురి తప్ప.. కాంగ్రెస్ పూర్తి చేసింది ఒక్కటీ లేదు. రెండేండ్ల కాంగ్రెస్ సర్కార్ పాలన తీరును అసెంబ్లీ వేదికగా చర్చించనున్నారు. ఇప్పటికే మూసీ పునర్జీవం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్భాటంగా చేసిన డీపీపీ ప్రజెంటేషన్‌లోని లోపాలు, మంచు కొండలా లక్షన్నర కోట్లకు పెరిగిన మూసీ అంచనా వ్యయాలు, రీహాబిలిటేషన్ విధానం వంటి అంశాలపై బీఆర్ఎస్ లేవనెత్తున్న అంశాలే అసెంబ్లీ వేదికగా చర్చకు పట్టుపట్టే అవకాశం ఉంది.
జనసంచారం లేని ఫ్యూచర్ సిటీకి..
రూ. 45వేల కోట్ల అంచనా వ్యయంతో అధికారంలోకి రావడంతోనే మెట్రో విస్తరణను అట్టహాసంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ క్రమంలో జనసంచారమే లేని ఫ్యూచర్ సిటీకి మెట్రో మార్గాన్ని మార్చడంతో నిలిచిన అనుమతుల ప్రక్రియ… ఎల్ అండ్ టీ నుంచి మెట్రో స్వాధీనంతో కొత్త మలుపు తిరిగింది. ఈ విషయంలో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న సమయంలో మెట్రో స్వాధీనాన్ని ప్రభుత్వ నెత్తిన పెట్టి, అదనపు భారాన్ని మోయడంతోపాటు, అమలు కానీ ప్రణాళికతో సర్కారు ముందుకు పోతుందనే అభిప్రాయం ఉంది. రూ. 15వేల కోట్ల చెల్లింపులు జరిగితే గానీ టేకోవర్ పూర్తయ్యే పరిస్థితి లేదు.
బాధిత ప్రజలకు భరోసా కల్పిస్తూ
గాంధీ సరోవర్ పేరిట హిమాయత్‌సాగర్ నుంచి బాపుఘాట్ దాకా ప్రజల ఇండ్లు, స్థలాలను లాక్కుంటామని ప్రభుత్వం జీవో ఇచ్చిన నాటి నుంచి బాధిత ప్రజల పక్షాన పోరాటాలు చేస్తున్నది బీఆర్ఎస్. తొలుత మాజీ మంత్రి హరీశ్‌రావు మధుపార్క్ అపార్ట్మెంట్లోని 450 కుటుంబాలను కలిసి వారికి మద్దతు తెలిపారు. ఒక్క ఇంటిని కూడా కూల్చుకుండా బుల్డోజర్లకు అడ్డంగా నిలిచైనా ప్రభుత్వాన్ని అడ్డకుంటామని వారిలో ధైర్యం నింపారు. అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధు పార్క్ రిడ్జ్ నుంచి విగ్నేశ్వర కాలనీ దాకా ప్రభుత్వం మార్కింగ్ చేసిన అన్ని అపార్ట్మెంట్లు, ఇండ్లు స్థలాల బాధితుల పక్షాన నిలబడి మూడున్నర కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. బాధితులకు భరోసా కల్పించారు. ప్రభుత్వం చేస్తున్న విధ్వంసాన్ని అసెంబ్లీలో చర్చించి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.
విభజనతో చెదిరిన ‘బృహత్’ కల
నగరం చుట్టూ విస్తరించి ఉన్న పురపాలికలను విలీనం చేసి బృహత్ హైదరాబాద్ నిర్మించాలనే ప్రణాళికలు ఉన్నాయి.కానీ రెండున్నరేండ్ల కాలంలోనే రేవంత్ సర్కారు… గ్రేటర్ హైదరాబాద్‌ను అస్తవ్యస్తంగా విభజన చేసి బృహత్ నగర కలను చెరిపివేసింది. ప్రస్తుతం సాధారణ మున్సిపల్ కార్పొరేషన్ స్థాయికి హైదరాబాద్ ఖ్యాతి దిగజారే పరిస్థితి వచ్చింది. సర్కారు అమలు చేస్తున్న విధానాలు విశ్వనగర ఖ్యాతిని దిగజార్చేలా ఉన్నాయనే అభిప్రాయం వ్యకమవుతున్నది. మూడు కార్పొరేషన్ల పాలనలో ప్రజా సమస్యలు మరింత జఠిలంగా మారాయి. పారిశుధ్య నిర్వహణలో లోపాలు, కనీస మౌలిక వసతులు నగరవాసులకు అందే పరిస్థితి లేకుండా పోయింది.