Number 01 Tree : దేశ పరిపాలనకు కేంద్రమైన పార్లమెంట్ (Parliament) లో భద్రత అత్యంత కట్టుదిట్టంగా ఉంటుంది. అయితే పార్లమెంట్ ఆవరణలో ఉన్న ఓ చెట్టు (Tree) మాత్రం భద్రతాధికారులకు తలనొప్పిగా మారింది. అది ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) తోపాటు కీలక నేతలందరి భద్రతకు ముప్పుగా పరిణమించిందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో దాన్ని తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
కొత్త పార్లమెంట్ భవనంలోని గజ ద్వారం వద్ద పసుపు పూలతో ఒక చెట్టు ఉంది. దాన్ని సిబ్బంది ‘నెంబర్ 1 చెట్టు’ అని పిలుస్తుంటారు. అయితే ఆ చెట్టు బాగా పెరిగిపోవడంతో వీవీఐపీల రాకపోకలను పర్యవేక్షించడానికి భద్రతాసిబ్బందికి ఇబ్బందిగా మారింది. ప్రధాని నరేంద్ర మోదీతోపాటు అత్యంత ముఖ్యమైన వ్యక్తులు అదే గేటు నుంచి రాకపోకలు సాగిస్తుండటంతో స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (SPG) దాన్ని తీవ్రమైన భద్రతాలోపంగా గుర్తించింది.
వెంటనే అప్రమత్తమైన ఎస్పీజీ, ఆ చెట్టును వేరే ప్రాంతానికి తరలించాలని సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ (CPWD) కి సూచించింది. అందుకు ఢిల్లీ అటవీ శాఖ అనుమతి తప్పనిసరి కావడంతో సీపీడబ్ల్యూడీ అధికారులు రూ.57 వేలు సెక్యూరిటీ డిపాజిట్‌గా చెల్లించారు. వచ్చే వారంలో ఆ చెట్టును పార్లమెంట్ ప్రాంగణంలోనే ఉన్న ‘ప్రేరణ స్థల్’కు మార్చే ప్రక్రియను చేపట్టనున్నారు. ఆ చెట్టుకు బదులుగా పార్లమెంట్ ఆవరణలో 10 కొత్త మొక్కలను నాటనున్నట్లు సీపీడబ్ల్యూడీ పేర్కొంది.