లోకల్ స్టేటస్ కోటాను ఉపసంహరించుకున్న ఫలితంగా సైనిక్ స్కూల్ ప్రవేశాల్లో తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరుగుతున్నది. 300కు 276 మార్కులు సాధించినా సీట్లు దక్కడం లేదు.
హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ) : సాధారణంగా ఏ పరీక్షలోనైనా ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులకు సీటు రావడం గ్యారెంటీ. కానీ, సైనిక్ స్కూల్స్ ప్రవేశాల్లో మాత్రం మెరిట్ మార్కులు పొందిన తెలంగాణ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతున్నది. 300 మార్కులకు 276 వచ్చినా సీటు రాకపోవడం నిరాశకు గురిచేస్తున్నది. తెలంగాణలో సైనిక్ స్కూళ్లు లేకపోవడం, ఏపీలోని కోరుకొండ, కలికిరి సైనిక్ స్కూళ్లలో తెలంగాణకు లోకల్ కోటా తొలగించడమే సీట్లు దక్కకపోవడానికి ప్రధాన కారణంగా తెలుస్తున్నది. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. సైనిక్ స్కూళ్ల ప్రవేశాల్లో తీరని అన్యాయం జరిగిందని వాపోతున్నారు. రాష్ర్టానికి చెందిన ఎంపీలు, కేంద్ర మంత్రులు చొరవ తీసుకుని న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
సైనిక్ స్కూల్స్ ఎంట్రెన్స్ టెస్ట్ ఫలితాలు గత వారం విడుదలయ్యాయి. ఈ పరీక్షలకు రాష్ట్రం నుంచి 20 వేల మంది విద్యార్థులు హాజరయ్యారు. మంగళవారం 2026 సంవత్సరం అడ్మిషన్ల తుది జాబితా విడుదలైంది. ఈ జాబితాలో తెలంగాణకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థుల పేర్లు లేకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఏపీ విద్యార్థులకు మాత్రం 240 మార్కులు వచ్చినా సీట్లు రావడం గమనార్హం. సైనిక్ స్కూల్స్ ప్రవేశాల్లో భాగంగా మొత్తం సీట్లల్లో 67శాతం సీట్లు స్థానికులకు, 33శాతం సీట్లను ఆలిండియా కోటాలో భర్తీచేస్తారు.
ఉమ్మడి ఏపీలో కోరుకొండ, కలికిరిలోని సైనిక్ స్కూళ్లలో తెలంగాణ విద్యార్థులకు లోకల్ కోటాలో సీట్లు కేటాయించేవారు. రాష్ట్ర విభజన జరిగి పదేండ్లు పూర్తవడంతో తెలంగాణ విద్యార్థులకు లోకల్ స్టేటస్ హోదాను ఉపసంహరించారు. దీంతో మన విద్యార్థులు 33శాతం సీట్లతో పోటీపడాల్సి వస్తున్నది. తెలంగాణలో సైనిక్ స్కూళ్లు ఉంటే 67 శాతం సీట్లు దక్కేవి. సైనిక్ స్కూళ్ల ప్రవేశాల్లో జరుగుతున్న అన్యాయాన్ని కొందరు తల్లిదండ్రులు క్రాంతి కీన్ ఫౌండేషన్ ప్రతినిధి, మెదక్ ఎంపీ రఘునందన్‌రావు దృష్టికి తీసుకెళ్లారు. లోకల్ కోటాను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.
