ఎల్లారెడ్డిపేట, మార్చి 3 : యుద్ధం కారణంగా అబుదాబి ఎయిర్‌పోర్ట్‌పై జరిగిన మిసైల్ దాడిలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పోతిరెడ్డిపల్లి వాసి గాయపడ్డాడు. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నందెల్లి రాజేశ్వర్‌రావు నాలుగేండ్లుగా బతుకు దెరువు కోసం అబుదాబిలోని ఎయిర్‌పోర్ట్‌లో క్లీనింగ్ సెక్షన్లో విధులు నిర్వర్తిస్తున్నాడు.
ఆదివారం ఇరాన్ జరిపిన మిసైల్ దాడిలో ఎయిర్పోర్ట్ అద్దాలు పగిలి గాజుపెంకులు రాజేశ్వర్‌రావు ఛాతి, కుడి చేతి భాగాన గుచ్చుకు పోవడంతో గాయపడ్డాడు. దీంతో స్థానికులు దవాఖానకు తరలించి, చికిత్స తర్వాత తన గదికి పంపించినట్టు రాజేశ్వర్‌రావు తన సోదరుడు రామారావుకు మెసేజ్ పంపించాడు. ఈ ఘటనలో ఎయిర్పోర్ట్ సమీపంలో ఇండియా, బంగ్లాదేశ్, పాకిస్థాన్‌కు చెందిన ముగ్గురు మృతి చెందినట్టు కూడా సమాచారమిచ్చినట్టు అతని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
విమాన రాకపోకలు నిలిచిపోవడంతో స్వదేశానికి వచ్చే పరిస్థితులు లేవని, రెండు మూడు రోజుల్లో సర్వీసులు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని చెప్పినట్టు తెలిపారు. దాడి ఘటన తెలుసుకున్న రాజేశ్వర్‌రావు కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కేంద్ర ప్రభుత్వం ఎలాగైనా రాజేశ్వర్‌రావును స్వగ్రామానికి రప్పించేందుకు ఏర్పాట్లు చేయాలని వేడుకుంటున్నారు.