మంచిర్యాల, మార్చి 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నిక సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ సహా బీఆర్ఎస్ నాయకులపై పెట్టిన అక్రమ కేసులో జిల్లా సెషన్స్ కోర్టు సోమవారం బెయిల్ మంజూరుచేసింది. చెన్నూర్ కోర్టులో ఉన్న మరో కేసులో పీటీ వారెంట్ పిటిషన్‌పై విచారణను ఆ కోర్టు ఈ నెల 5కు వాయిదావేసింది. బాల్కసుమన్కు ఈ కేసులో నూ బెయిల్ రావాల్సి ఉండటంతో, ఐదో తేదీ తర్వాతే ఆయన జైలు నుంచి బయటికి వస్తారని అంతా భావించారు.
ఈ నేపథ్యంలో మంగళవారం చెన్నూర్ కోర్టులో పీటీ వారెంట్ పిటిషన్‌పై విచారణ జరపాలని బాల్కసుమన్ తరఫు న్యాయవాదులు మరో పిటిషన్ వేయడంతో మంగళవారం కోర్టు విచారణను స్వీకరించింది. బాల్క సుమన్ తరుఫు న్యాయవాదుల వాదనల అనంతరం బెయిల్ మంజూరుచేసింది. దీంతో బుధవారం బాల్కసుమన్ సహా బీఆర్ఎస్ నాయకులు జైలు నుంచి బయటికి వస్తారని న్యాయవాదులు తెలిపారు.
ఈ నేపథ్యంలో చెన్నూర్‌లో అడ్వకేట్ మల్లేశంగౌడ్తో కలిసి బీఆర్ఎస్ నాయకులు సంబురాలు చేసుకున్నారు. బాల్కసుమన్ సహా ఇతర బీఆర్ఎస్ నాయకులను వందలాది వాహనాల్లో ర్యాలీగా క్యాతనపల్లికి తీసుకురానున్నారు. మంచిర్యాల జిల్లా పరిధిలోని ప్రధాన మార్గాల్లోని అంబేద్కర్ విగ్రహాలకు, మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి సుమన్ పూలమాలలు వేసి, అక్కడి నుంచి క్యాతనపల్లిలోని తన నివాసానికి వస్తారని బీఆర్ఎస్ నాయకులు తెలిపారు.
క్యాతనపల్లి ఎన్నిక నేపథ్యంలో జరిగిన గొడవపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఎంక్వైరీ చేస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. క్యాతనపల్లి ఎన్నిక వాయిదా పడ్డాక, ఫిబ్రవరి 17న కౌన్సిల్హాల్లో ఏం జరిగిందో నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌ను ఆదేశించినట్టు సమాచారం. ఎన్నిక సందర్భంగా ఎలక్షన్ కమిషన్ నిబంధనలు పాటించలేదని ఈసీ ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్టు తెలిసింది. ఎన్నికైన సభ్యులందరూ క్యాతనపల్లి కౌన్సిల్‌కు హాజరయ్యాక ప్రమాణ స్వీకారం పూర్తి చేసి, వెంటనే ఎన్నిక నిర్వహించాలి.
నిబంధనలకు విరుద్ధంగా ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఉన్న మంత్రి వివేక్ మాట్లాడటం, బ్రేక్ తర్వాత గొడవ జరగడం, బీఆర్ఎస్-సీపీఐ, కాంగ్రెస్, ఇండిపెండెంట్ సభ్యులకు విడివిడిగా వేసిన సీట్ల మధ్య బారికేడ్లు ఏర్పాటు చేయకపోవడం, మీడియాను అనుమతించకపోవడం తదితర అంశాలపై ఎన్నికల సంఘం సీరియస్‌గా ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే బీఆర్ఎస్- సీపీఐ ఎన్నికల సంఘంకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అధికారులు ఉద్దేశపూర్వకంగా చేశారా.. అవగాహన లోపంతో చేశారా అన్న దానిపై ఆరా తీస్తున్నట్లు తెలిసింది.