Jairam Ramesh : పహల్గాం (Pahalgam) ఉగ్రదాడి (Terror attack) అనంతరం భారత్ (Bharat), పాకిస్థాన్ (Pakistan) దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తానే తగ్గించానని అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పదేపదే ప్రకటించుకుంటుండటంపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ (Congress party) అసహనం వ్యక్తం చేసింది. ట్రంప్ పదేపదే ఆ మాట చెబుతున్నా కేంద్ర ప్రభుత్వంగానీ, ప్రధాని మోదీగానీ ఎందుకు ఖండించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది.
ద్వైపాక్షిక చర్చల ద్వారా మాత్రమే కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందని ప్రధాని మోదీ ఎందుకు చెప్పలేకపోతున్నారని కాంగ్రెస్ ప్రశ్నించింది. భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించానని ట్రంప్ పదేపదే చెబుతున్నారని, గడిచిన 21 రోజుల్లో 11 సార్లు ఆ మాట చెప్పారని కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేశ్ చెప్పారు. రెండు అణ్వస్త్ర దేశాల మధ్య ఘర్షణలు తగ్గించడానికి తాము జోక్యం చేసుకున్నామని, వాణిజ్యాన్ని ఒక సాధనంగా వాడామని ట్రంప్ చెప్పుకుంటున్నారని తెలిపారు. చివరికి కోర్టులోనూ అదే వాదన చేశారని, అయినా ట్రంప్ వ్యాఖ్యలపై నరేంద్రమోదీ పూర్తిగా మౌనం వహిస్తున్నారని విమర్శించారు. ప్రధాని ఎందుకు ఎందుకు మాట్లాడటం లేదని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.
కాగా ‘భారత్- పాకిస్థాన్ల మధ్య కాల్పుల విరమణకు మా యంత్రాంగం మధ్యవర్తిత్వం వహించింది. వాణిజ్యం విషయంలోనూ మేం అండగా ఉన్నాం. ఉద్రిక్తతలకు ముగింపు పలికితేనే వాణిజ్య సంబంధాలు బలోపేతం చేసుకుంటాం. లేదంటే ఎలాంటి వాణిజ్యం చేయబోమని స్పష్టంచేశాం. దాంతో ఆ రెండు దేశాలు సానుకూలంగా స్పందించాయి’ అని ట్రంప్ చెబుతున్నారు. అయినా ప్రభుత్వం ఖండించకపోవడంపై కాంగ్రెస్ అసహనం వ్యక్తం చేస్తోంది.