MJ Akbar : భారత విదేశాంగశాఖ (Indian foreign ministry) మాజీ సహాయ మంత్రి ఎంజే అక్బర్ (MJ Akbar) పాకిస్థాన్ (Pakistan) పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పాకిస్థాన్‌ను పాముతో పోల్చారు. అబద్ధాలతో కాలం గడుపుతున్న, కపటనీతి కలిగిన దేశంతో చర్చలు జరపడం కష్టమని వ్యాఖ్యానించారు. దాయాది పాకిస్థాన్‌తో చర్చలు జరపవచ్చుకదా? అంటూ కొందరు చేస్తున్న వాదనపై ఆయన మాట్లాడారు.
దాని వెనుక లాజిక్ ఏమిటని ఎంజే అక్బర్ ప్రశ్నించారు. బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ నేతృత్వంలో విదేశాల్లో పర్యటిస్తున్న విపక్ష బృందంలో అక్బర్ సభ్యుడిగా ఉన్నారు. కోపెన్‌హాగన్‌లో ప్రవాస భారతీయులు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాకిస్థాన్‌పై నిప్పులు చెరిగారు. పాకిస్థాన్‌లో చిత్తశుద్ధి లేని ప్రభుత్వం ఉన్నదని, అలాంటప్పుడు ఎవరితో చర్చించాలని ప్రశ్నించారు.
‘పాకిస్థాన్‌తో భారత్ ఎందుకు చర్చలు జరపదని కొందరు మిత్రులు అడుగుతున్నారు. అక్కడ చిత్తశుద్ధిలేని ప్రభుత్వం ఉంది. ఎవరితో చర్చలు జరపాలి..? అక్కడ వాగ్దానాలను ఉల్లంఘించే ప్రభుత్వం ఉంది. ఎవరితో మాట్లాడాలి..? అది విషపు నాలుక కలిగిన ప్రభుత్వం. దానివల్ల ఎవరికి నష్టం..? పాము ఎప్పుడూ తన విషంతో తాను చనిపోదనే విషయాన్ని గుర్తించాలి.’ అని అక్బర్ వ్యాఖ్యానించారు.
భారత్‌లో దీర్ఘకాలంగా అశాంతికి పాకిస్థాన్ ప్రధాన కారణమని ఎంజే అక్బర్ ఆరోపించారు. ఓ సాకుగా మారిన విషయాలపై చర్చల కోసం భారత్ తన సమయాన్ని వృథా చేసుకోదని స్పష్టం చేశారు. చర్చల కాలాన్ని దాయాది దేశం మరో ఉగ్రదాడికి ఉపయోగించుకుంటుందని మండిపడ్డారు. పాక్ నోట చర్చలు అనేవి బూటకపు మాటలు తప్ప మరేమీ లేదని మండిపడ్డారు. అవసరమైన విషయాలపై చర్చలు జరుపుతామని, అది కూడా పీవోకేని తిరిగి తీసుకునే విషయంపైనేనని చెప్పారు.