PM Modi : పహల్గాం (Pahalgam) లో క్రూరమైన దాడికి పాల్పడి, భారత నారీశక్తికి సవాల్ విసిరి.. ఉగ్రవాదులు (Terrorists) వాళ్ల వినాశనాన్ని వాళ్లే కొనితెచ్చుకున్నారని ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. ఉగ్రదాడికి ప్రతీకారంగా ‘ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor)’ లో పాల్గొని పలువురు మహిళా అధికారిణులు సత్తా చాటారని, ఉగ్రవాదుల ఆచూకీని గల్లంతు చేశారని కీర్తించారు.
రాణి అహల్యాబాయి హోల్కర్ 300వ జయంతి సందర్భంగా మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో నిర్వహించిన ‘మహిళా స్వశక్తికరణ్ మహా సమ్మేళన్’లో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉగ్రవాదులే కాదు, వాళ్లను పోషించేవాళ్లు కూడా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత్ ప్రపంచానికి చాటి చెప్పిందన్నారు.
ఆపరేషన్ సింధూర్లో భారత ఆడబిడ్డల బలాన్ని ప్రపంచం మొత్తం చూసిందని ప్రధాని చెప్పారు. ఆపరేషన్ సింధూర్ అనంతరం భారత్లోని సరిహద్దు రాష్ట్రాలపై పాకిస్థాన్ దాడులు చేసిందని, ఆ సందర్భంగా అసిస్టెంట్ కమాండెంట్ నేహా భండారి నేతృత్వంలోని మహిళా బీఎస్ఎఫ్ (BSF) బృందం మూడు రోజుల పాటు అఖ్నూర్లోని తమ ఫార్వర్డ్ పోస్టుల నుంచి పోరాటం చేసిందని ప్రశంసించారు.
‘మన సంప్రదాయంలో సింధూర్ ‘నారీశక్తి’కి చిహ్నం. పహల్గాంలో, ఉగ్రవాదులు కేవలం మన పౌరుల రక్తం మాత్రమే కళ్ల చూడలేదు. మన సంస్కృతిపై దాడి చేశారు. మన సమాజాన్ని విభజించడానికి ప్రయత్నించారు. ఉగ్రవాదులు భారత నారీశక్తికి విసిరిన సవాలే వారి పాలిట, వారిని పోషిస్తున్నవారి పాలిట శాపంగా మారింది. పాకిస్థాన్ సైన్యం కూడా ఊహించని ప్రాంతాల్లో ఉగ్రవాద శిబిరాలపై మన సాయుధ దళాలు దాడులు చేశాయి. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశం చేపట్టిన ఈ ఆపరేషన్ భారత చరిత్రలోనే అతిపెద్ద విజయం’ అని ప్రధాని వ్యాఖ్యానించారు.
భోపాల్లో నిర్వహించిన ‘మహిళా స్వశక్తికరణ్ మహా సమ్మేళన్’లో పాల్గొన్న ప్రధాని మోదీ ఇండోర్ మెట్రో, దాటియా, సత్నా విమానాశ్రయాల సూపర్ ప్రియారిటీ కారిడార్లను వర్చువల్గా ప్రారంభించారు. వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. రూ.483 కోట్లతో నిర్మించిన కొత్త అటల్ గ్రామ సేవా సదన్ (పంచాయత్ భవన్) లకు ఇవ్వాల్సిన మొదటి విడత మొత్తాన్ని మోదీ బదిలీ చేశారు.
18వ శతాబ్దానికి చెందిన మాల్వాలోని హోల్కర్ రాజవంశం హయాంలో రాణి అహల్యాబాయి అసాధారణ పాలన, సామాజిక సంక్షేమంపై నిబద్ధతను ప్రధాని కొనియాడారు. రాణి అహల్యాబాయికి అంకితం చేసిన పోస్టల్ స్టాంప్, రూ.300 స్మారక నాణాన్ని ప్రధాని ఈ సందర్భంగా విడుదల చేశారు.