Ind vs US : రష్యా (Russia) నుంచి భారత్ (India) చమురు కొనుగోళ్లను నిలిపివేయకపోవడంపై అమెరికా, ఐరోపా దేశాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తున్నాయి. యుద్ధంలో ఉక్రెయిన్ (Ukraine) పౌరుల ప్రాణాలు పోతున్నా భారత్ పట్టించుకోవడం లేదని అమెరికా (USA) విమర్శిస్తోంది. అయితే అమెరికా, ఐరోపా దేశాలు తనను టార్గెట్ చేసుకోవడంపై భారత్ మండిపడింది.
ఆయా దేశాలకు గట్టి కౌంటర్ ఇచ్చింది. అణు పరిశ్రమకు అవసరమైన యురేనియం హెక్సాఫ్లోరైడ్ను, విద్యుత్ వాహనాలు, ఎరువుల తయారీకి అవసరమైన పలేడియంను రష్యా నుంచి అమెరికా ఎందుకు దిగుమతి చేసుకుంటోందని ప్రశ్నించింది. రష్యా నుంచి మీరు దిగుమతులు చేసుకుంటే ఒప్పు, మేం దిగుమతులు చేసుకుంటే తప్పా అని నిలదీసింది.
ఉక్రెయిన్ ఘర్షణ అనంతరం-అంతర్జాతీయ విపణిలో తలెత్తిన పరిస్థితుల వల్లే దేశీయ ఇంధన అవసరాలను తీర్చుకోవడానికి రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నామని భారత విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. తమ దేశ ప్రయోజనాల పరిరక్షణ కోసం అవసరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.