Uttarkashi cloudburst : ఉత్తరాఖండ్ (Uttarakhand) రాష్ట్రంలోని ఉత్తరకాశీ (Uttarakashi) జిల్లాలో సంభవించిన జలప్రళయంపై ప్రధాని (Prime minister) నరేంద్రమోదీ (Naredra Modi) తీవ్ర విచారం వ్యక్తంచేశారు. ప్రస్తుత పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఉత్తరాఖండ్ సీఎం (Uttarakhand CM) పుష్కర్ సింగ్ ధామీ (Pushkar Singh Dhami) కి ఫోన్ చేసి ప్రధాని మాట్లాడారు. ఉత్తరకాశీలోని ధరాలీ గ్రామాన్ని వరదలు ముంచెత్తడం విచారకరం, బాధితులంతా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నా’ అని ప్రధాని చెప్పారు.
ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఉత్తరకాశీ జిల్లాను వరద చుట్టుముట్టింది. క్లౌడ్‌బరస్ట్ కారణంగా కుండపోత వర్షం కురిసింది. ఈ వర్షానికి ఖీర్ గంగా నది ఒక్కసారిగా ధరాలీ గ్రామంపై విరుచుకుపడింది. భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. వరద ప్రవాహం ధరాలీ గ్రామాన్ని ముంచెత్తడంతో వందలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఊహించని జలప్రళయంతో ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు.
ఈ విపత్తులో దాదాపు 60 మంది గల్లంతయ్యారు. నలుగురు మృతిచెందారు. సమాచారం అందుకున్న ఆర్మీ, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాయి. గల్లంతైన వారి కోసం గాలింపు చేపడుతున్నారు. ఇందుకు సంబంధించిన భయానక దృశ్యాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.