Sleeper train : రైలు ప్రయాణికులకు రైల్వే మంత్రిత్వ శాఖ (Railway Ministry) శుభవార్త చెప్పింది. త్వరలో వందే భారత్ (Vande Bharat) తొలి స్లీపర్ రైలు ప్రారంభమవుతుందని రైల్వే మంత్రి (Railway Minister) అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnav) తెలిపారు. సెప్టెంబర్ నెలలో పట్టాలెక్కనున్న ఈ కొత్త రైలు భారత రైల్వేలో విప్లవాత్మక మార్పులను తీసుకురానుందని మంత్రి ప్రకటించారు. అదేవిధంగా ముంబై-అహ్మదాబాద్ (Mumbai-Ahmedabad) మధ్య దేశంలోనే తొలి బుల్లెట్ రైలు (Bullet train) సేవలు త్వరలో ప్రారంభమవుతాయని ఆయన తన ప్రకటనలో పేర్కొన్నారు. ఇది 508 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 2 గంటల 7 నిమిషాల్లో చేరుకుంటుందని తెలిపారు.
ఇక సెప్టెంబర్‌లో పట్టాలెక్కబోతున్న తొలి వందే భారత్ స్లీపర్ రైలు ప్రత్యేకతల విషయానికి వస్తే.. అది ఒక కొత్త రకం సెమీ హైస్పీడ్ రైలు. భారత రైల్వేలో రాత్రిపూట ప్రయాణాలకు సౌకర్యవంతమైన ప్రత్యామ్నాయంగా దీన్ని రూపొందించారు. ప్రస్తుతం దేశంలో 50 కంటే ఎక్కువ వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. కానీ అవి కేవలం చైర్ కార్ సౌకర్యంతో శతాబ్ది రూట్లలో నడుస్తున్నాయి. ఈ వందే భారత్ స్లీపర్ రైళ్లను రాజధాని రూట్లలో నడిచేలా రూపొందించారు.
ఈ రైళ్లు గంటకు 180 కిలోమీటర్ల వేగంతో నడుస్తాయి. ఏసీ ఫస్ట్‌క్లాస్, ఏసీ 2 టయర్, ఏసీ 3 టయర్ సహా 16 కోచ్‌లతో 1,128 మంది ప్రయాణికుల సామర్థ్యాన్ని ఈ రైళ్లు కలిగి ఉంటాయి. ఇవి న్యూఢిల్లీ-హౌరా, న్యూఢిల్లీ-ముంబై, న్యూఢిల్లీ-పుణె, న్యూఢిల్లీ-సికింద్రాబాద్ మధ్య నడిచే అవకాశం ఉంది. అయితే ఈ విషయంలో రైల్వే బోర్డు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సోమవారం భావ్‌నగర్‌లో డిజిటల్‌గా మూడు కొత్త రైళ్లను ప్రారంభించారు. వాటిలో అయోధ్య ఎక్స్‌ప్రెస్, రేవా-పుణే ఎక్స్‌ప్రెస్, జబల్పూర్-రాయ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ ఉన్నాయి. అలాగే 8 అమృత్ భారత్ రైళ్లను కొత్తగా ప్రవేశపెట్టినట్టు ఆయన తెలిపారు.