Sanjay Nishad : భారీ వర్షాలవల్ల నదులు ఉప్పొంగి ప్రవహిస్తుంటాయి. వరదలు ముంచెత్తుతాయి. ఈ విపత్తులవల్ల ప్రజలు సర్వం కోల్పోతుంటారు. ఒంటిమీద దుస్తులు తప్ప ఎలాంటి ఆధారం లేకుండా మిగిలిపోతుంటారు. వారిని చూస్తే ఎవరికైనా హృదయం కదిలిపోతుంది. ఓదార్చాలనిపిస్తుంది. కానీ ఓ మంత్రి మాత్రం వారికి ఓదార్పును ఇవ్వకపోగా.. వారి సమస్య చాలా చిన్నది అన్నట్లుగా మాట్లాడాడు. ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ దెహాత్ జిల్లాలో వరదలు సంభవించాయి. ఆ వరద ప్రభావిత ప్రాంతాల్లో యూపీ మంత్రి సంజయ్ నిషాద్ పర్యటించగా బాధితులు ఆయన వద్ద తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమ ప్రాంతం అంతా నీట మునిగిందని, ఇళ్లు కూలిపోయాయని, తాము ఎక్కడకు వెళ్లాలో తెలియడం లేదని వాపోయారు. వారి బాధలు విన్న తర్వాత మంత్రి నిర్లక్ష్యంగా స్పందించారు.
‘గంగమ్మతల్లి తన బిడ్డల పాదాలు కడగడానికి వస్తుంది. ఆ గంగ దర్శనం ద్వారా ఆ బిడ్డలు స్వర్గానికి వెళతారు. మిమ్మల్ని విపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయి’ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దాంతో బాధితులు ఖంగుతిన్నారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. బీజేపీ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో నిషాద్ పార్టీ భాగస్వామ్య పక్షంగా ఉంది. సంజయ్ ఆ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారు.
భారీ వర్షాల కారణంగా ఆగ్రా, చిత్రకూట్, లఖింపూర్ ఖేరీ లాంటి 17 జిల్లాలు వరద ప్రభావానికి గురయ్యాయి. గంగా, యమునతో సహా పలు నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. అయితే తర్వాత మంత్రి వరద సాయాన్ని అందించారు.