Massive wildfire : అమెరికా (USA) లోని సెంట్రల్ కాలిఫోర్నియా (California) లో భారీ కార్చిచ్చు (Wildfire) సంభవించింది. గత శుక్రవారం మొదలైన ఈ కార్చిచ్చు వేగంగా వ్యాపిస్తోంది. కార్చిర్చు కారణంగా దట్టమైన పొగలు అలుముకుని గాలి నాణ్యత క్షీణిస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ‘గిఫోర్డ్ ఫైర్ (Gifford Fire)’ గా పేర్కొనే ఈ కార్చిచ్చు ప్రస్తుతం 65 వేల ఎకరాలకు పైగా విస్తరించింది.
భారీగా మంటలు ఎగిసిపడుతుండటంతో చుట్టుపక్కల దట్టమైన పొగ వ్యాపించింది. లాస్ ఏంజిల్స్, వెంచురా, కార్న్ వంటి దక్షిణ కాలిఫోర్నియా కౌంటీల్లోని నివాసితులతో పాటు పొరుగునున్న లాస్ వెగాస్‌లోని ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. గాలినాణ్యత క్షీణిస్తుండటంతో పలు సూచనలు జారీ చేశారు. ప్రభావం ఎక్కువగా ఉండే సమీప ప్రాంతాల్లోని వారిని తరలిస్తున్నారు.
మరోవైపు మంటలను అదుపు చేసేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. సోమవారం నాటికి 3 శాతం మంటలను మాత్రమే అదుపులోకి తీసుకురాగలిగామని అధికారులు తెలిపారు. వాతావరణ పరిస్థితుల కారణంగా అడ్డంకులు తప్పడం లేదన్నారు. మంటలవల్ల చుట్టుపక్కల రహదారులను కూడా అధికారులు మూసేశారు. దాంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రానున్న రోజుల్లో వాతావరణం మరింత వేడెక్కనుందని, పరిస్థితులు మరింత తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.