Venkatesh | టాలీవుడ్లో విజయవంతమైన కాంబినేషన్లలో ఒకటిగా నిలిచిన విక్టరీ వెంకటేష్ – అనిల్ రావిపూడి జోడీ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే పలు విజయవంతమైన చిత్రాలను అందించిన ఈ కాంబినేషన్లో ఐదో సినిమాకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్‌కు వెంకటేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన ఎఫ్2,ఎఫ్ 3వంటి చిత్రాలు భారీ విజయాన్ని సాధించాయి. అలాగే సంక్రాంతికి వస్తున్నాం, మన శంకర వరప్రసాద్ గారు వంటి చిత్రాలు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు అదే జోష్‌తో మరో ఎంటర్టైనింగ్ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించేందుకు దర్శకుడు అనిల్ రావిపూడి స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నారు.
ఈ చిత్రంలో ప్రత్యేక ఆకర్షణగా నందమూరి కళ్యాణ్ రామ్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారని సమాచారం. ఆయన పాత్ర కథలో కీలక మలుపు తిప్పేలా ఉంటుందని తెలుస్తోంది. వెంకటేష్ – కళ్యాణ్ రామ్ కాంబినేషన్ ప్రేక్షకుల్లో ఇప్పటికే ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇక ఈ సినిమాలో వెంకటేష్ సరసన హీరోయిన్గా కీర్తి సురేష్ నటించనున్నట్లు తెలుస్తోంది. మహానటి చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన కీర్తి సురేష్ ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌కు సంతకం చేసినట్లు సమాచారం. అయితే కళ్యాణ్ రామ్‌కు జోడీగా నటించే హీరోయిన్ ఎంపిక ఇంకా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
ఈ చిత్రానికి సంగీతాన్ని భీమ్స్ సిసిరోలియో అందించనుండగా, సినిమాటోగ్రఫీ బాధ్యతలను సమీర్ రెడ్డి చేపట్టనున్నారు. నిర్మాణ బాధ్యతలను షైన్ స్క్రీన్స్ మరియు సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్వహించనున్నాయి. ప్రస్తుతం వెంకటేష్ నటిస్తున్న సినిమా పూర్తికాగానే ఈ కొత్త ప్రాజెక్ట్ షూటింగ్ ప్రారంభం కానుంది. జూన్ నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి సెంటిమెంట్‌ను కొనసాగిస్తూ ఈ చిత్రాన్ని 2027 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారు. అనిల్ రావిపూడి ప్రత్యేకమైన కామెడీ స్టైల్, వెంకటేష్ టైమింగ్ కామెడీకి తోడు కళ్యాణ్ రామ్ పాత్ర కూడా ఆసక్తికరంగా ఉండనుండటంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. టాలీవుడ్లో మరో బిగ్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం నిలిచే అవకాశాలు ఉన్నాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.