Bird Flu : ఈ ఏడాది ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో 41 బర్డ్ ఫ్లూ కేసులు (Bird Flu cases) నమోదయ్యాయని కేంద్ర ప్రభుత్వం (Union Govt) వెల్లడించింది. కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని తెలిపింది. బుధవారం రాజ్యసభ (Rajya Sabha) కు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, డెయిరీ శాఖల మంత్రి ప్రొఫెసర్ ఎస్పీ సింగ్ బఘేల్ (SP Singh Baghel) పేర్కొన్నారు. అయితే ఈ ఇన్ఫెక్షన్లు పక్షి జాతికి చెందని పులి, సింహం, చిరుత, దేశవాలీ పిల్లుల్లో కూడా కనిపించాయని మంత్రి తెలిపారు.
అంటే మానవుల్లో కూడా బర్డ్ ఫ్లూ రిస్క్ పెరిగే ప్రమాదం ఉందనడానికి ఇది సంకేతమని మంత్రి పేర్కొన్నారు. ఈ ఏడాది జూలై 24 నాటికి భారత్లో మొత్తం 41 బర్డ్ ఫ్లూ కేసులు వెలుగుచూశాయని, గడిచిన ఐదేళ్లలో నమోదైన కేసులతో పోల్చుకుంటే ఈ సంఖ్య తక్కువేనని తెలియజేశారు. 2024లో జూలై 24 నాటికి 49 కేసులు నమోదయ్యాయని, 2021లో అత్యధికంగా 118 కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. అతి తక్కువగా 2023లో 15 కేసులు మాత్రమే నమోదయ్యాయని తెలిపారు.
ఇప్పటివరకు మహారాష్ట్ర, ఛత్తీసగఢ్, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, బీహార్, ఉత్తరప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కేసులు నమోదయ్యాయని మంత్రి తన రిటన్ రిప్లేలో పేర్కొన్నారు. బర్డ్ ఫ్లూ నియంత్రణకు ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపడుతుందని తెలిపారు.