Dharmasthala : కర్ణాటక (Karnataka) రాష్ట్రంలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం ‘ధర్మస్థల (Dharmasthala)’ లో అనుమానాస్పద మరణాలపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. సిట్ చీఫ్ (SIT chief) ప్రణబ్ మొహంతి (Pranab Mohanty), డీఐజీ (DIG) ఎంఎన్ అనుచేత్ (MN Anucheth) ఆధ్వర్యంలో ధర్మస్థల మిస్టరీపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసు దర్యాప్తులో గురువారం కీలక ముందడుగు పడింది. పారిశుద్ధ్య కార్మికుడు చూపించిన ఆరో స్థలం (Sixth site) లో ఇవాళ తవ్వకాలు జరుపగా ఎముకలు బయటపడ్డాయి.
కర్ణాటక రాష్ట్రం శ్రీక్షేత్ర సమీపంలోని అటవీ ప్రాంతంలో తానే స్వయంగా కొన్ని శవాలను పూడ్చి పెట్టానని ఒకప్పుడు అక్కడ పనిచేసిన పారిశుద్ధ్య కార్మికుడు ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసి సంచలనం రేపాడు. పారిశుద్ధ్య కార్మికుడి ఫిర్యాదు నేపథ్యంలో ఆ అనుమానాస్పద మరణాలపై కర్ణాటక ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. సిట్ చీఫ్‌గా ప్రణబ్ మొహంతిని నియమించింది. మొహంతి నేతృత్వంలోని సిట్ బృందం ఇప్పుడు ముమ్మరంగా కేసు దర్యాప్తు చేస్తోంది.
సిట్ బృందానికి పారిశుద్ధ్య కార్మికుడు మొత్తం 14 ప్రదేశాలను చూపించాడు. ఆ 14 ప్రదేశాల్లో తవ్వకాల కోసం సిట్ 20 మంది కూలీలను నియమించుకుని తవ్వకాలు సాగిస్తోంది. గత సోమవారం నుంచి సిట్ దర్యాప్తు మొదలైంది. ఇప్పటికే ఐదు ప్రదేశాల్లో తవ్వకాలు పూర్తయ్యాయి. తొలి ప్రదేశంలో గత వారం తవ్వకాలు జరుపగా ఒక చీటి, ఒక పర్సు లభ్యమయ్యాయి. వాటిని పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. ఆ తర్వాత నాలుగు ప్రదేశాల్లో తవ్వకాలు జరుపగా ఎలాంటి ఆనవాళ్లు లభ్యం కాలేదు.
ఈ క్రమంలో పారిశుద్ధ్య కార్మికుడు చూపించిన ఆరో ప్రదేశంలో ఇవాళ సిట్ అధికారులు తవ్వకాలు జరిపించారు. ఈ తవ్వకాల్లో పెద్ద సంఖ్యలో ఎముకలు దొరికాయి. అనుమానాస్పద మరణాలకు సంబంధించి ఇప్పటివరకు సిట్ అధికారులకు దొరికిన తొలి ఆధారం ఇదే కావడం గమనార్హం. మరో ఎనిమిది ప్రదేశాల్లో కూడా సిట్ అధికారులు తవ్వకాలు జరపనున్నారు. మరిన్ని ఆధారాలు దొరికే అవకాశం ఉంది. తాను చూపించిన 14 ప్రదేశాలకుగాను 9 నుంచి 13 ప్రదేశాల్లో మానవ అవశేషాలు లభించే అవకాశం ఉందని పారిశుద్ధ్య కార్మికుడు చెబుతున్నాడు.
నేత్రావతి నది స్నానఘట్టానికి అవతలివైపు ఉన్న ప్రాంతం నుంచి అధికారులు పరిశోధన ప్రారంభించారు. కాగా ధర్మస్థల దక్షిణ కన్నడ జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం. కర్ణాటక ప్రజలతోపాటు పొరుగు రాష్ట్రాల నుంచి ఇక్కడికి భారీగా భక్తులు వస్తుంటారు. గతంలో అక్కడ పనిచేసి మానేసిన ఓ పారిశుద్ధ్య కార్మికుడు.. సంచలన విషయాలు బయటపెట్టాడు. 1998 నుంచి 2014 మధ్య అక్కడ అనేక మంది మహిళలు, యువతులు హత్యకు గురయ్యారని, వారి మృతదేహాలను తానే పూడ్చి పెట్టానని పోలీసులకు చెప్పాడు.
అవన్నీ అనుమానాస్పద రీతిలో అదృశ్యమైన వారి మృతదేహాలని, వారు లైంగిక దాడులకు గురై చనిపోయినట్లు అనుమానాలున్నాయని అతడు తెలిపాడు. అతడి మాటలు కర్ణాటక రాష్ట్రాన్ని ఉలిక్కిపడేలా చేశాయి. కాగా 2014 డిసెంబర్లో తమ కుటుంబంలోని ఒక యువతిని కొందరు లైంగికంగా వేధిస్తుండటంతో తాము ఆనాడు అజ్ఞాతంలోకి వెళ్లిపోయామని ఆ పారిశుద్ధ్య కార్మికుడు తెలిపాడు. ఈ క్రమంలో మృతదేహాలను ఎవరు ఖననం చేయమన్నారు..? ఎవరి సాయంతో వాటిని తీసుకువెళ్లేవారు..? తదితర వివరాలను అధికారులు ఆ కార్మికుడి నుంచి అడిగి తెలుసుకుంటున్నారు.