హనుమకొండ చౌరస్తా, మార్చి 4 : తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన మాదిగ సామాజిక వర్గానికి రాజ్యసభ స్థానం కేటాయించాలని ఎంఎస్పీ జాతీయ అధికార ప్రతినిధి మంద కుమార్ మాదిగ(Manda Kumar Madiga) డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ తరఫున త్వరలో భర్తీ కాబోయే.. రెండు సీట్లలో ఒకటి మాదిగలకు ఇవ్వాలని ఆయన అన్నారు. గత లోక్సభ ఎన్నికల్లో మాదిగలకు ఒక్క టికెట్ కూడా ఇవ్వకుండా కాంగ్రెస్ అన్యాయం చేసిందని.. తెలంగాణ నుంచి మాదిగలు పార్లమెంట్లో అడుగు పెట్టకుండా ఆ పార్టీ కుట్రలు చేస్తోందని మహాజన సోషలిస్ట్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మంద కుమార్ మాదిగ ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ పార్టీ ఈసారి కచ్చితంగా మాదిగలకు రాజ్యసభ స్థానాన్ని కేటాయించాలని డిమాండ్ చేస్తూ
ఎంఎస్పీ జాతీయ అధికార ప్రతినిధి మంద కుమార్ మాదిగ కాంగ్రెస్ భవన్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం తెలంగాణ నుంచి పార్లమెంట్లో ఓసీలకు, బీసీలకు, ఎస్టీలకు.. అలాగే ఎస్సీలలో మాలలకు ప్రాతినిధ్యం ఉందని, ప్రాతినిధ్యం లేని కులం మాదిగ మాత్రమేనని ఆయన గుర్తు చేశారు. ఇప్పటికే రాజ్యసభలో ప్రాతినిధ్యం కలిగిన రెడ్డి, బీసీ సామాజిక వర్గానికి మరోమారు అవకాశం ఇచ్చే బదులు అసలే రాజకీయ ప్రాతినిధ్యం లేని మాదిగలకు ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం పాటించాలని ఆయన డిమాండ్ చేశారు.
వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో.. మాదిగలకు ఏకకాలంలో రాజ్యసభలోను, లోక్సభలోను ప్రాతినిధ్యం ఉందని ఆయన తెలిపారు. ‘లోక్ సభలో మంద జగన్నాథం, సిరిసిల్ల రాజయ్య, రాజ్యసభలో నంది ఎల్లయ్య మాదిగ సామాజిక వర్గం నుంచి ఎంపీలయ్యారు. అలానే చంద్రబాబు నాయుడు నేతృత్వంలో తెలంగాణ నుంచి ఇద్దరు మాదిగలు లోక్సభలో ఉన్నారు. కానీ.. రేవంత్ రెడ్డి కాలంలో లోక్సభలో, రాజ్యసభలోనూ ఒక్క మాదిగ కులస్తులు కూడా లేర’ని మంద కుమార్ మాదిగ దుయ్యబట్టారు.
ఉమ్మడి ఏపీ సీఎంలు రాజశేఖర్రెడ్డి, చంద్రబాబు నాయుడులతో పోల్చితే తెలంగాణ రెండో ముఖ్యమంత్రి రేవంత్ మాత్రం.. మాదిగలకు సరైన ప్రాతినిధ్యం, గుర్తింపు ఇవ్వడంలో చాలా వెనుకబడ్డారని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ర్ట ఉపాధ్యక్షులు జన్ను దినేష్ మాదిగ, వేల్పుల సూరన్న, పుట్ట రవి మాదిగ, జన్ను దినేష్ మాదిగ, ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు బండారి సురేందర్ మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు గద్దల సుకుమార్ మాదిగ, మందరాజు మాదిగ, గంగరపు శ్రీనివాస్ మాదిగ అక్కణకుంట వెంకటస్వామి, రాజరాపు బిక్షపతి మాదిగ, రేణుకుంట్ల మహేష్ మాదిగ, రజనీకార్ మాదిగ, అనిల్ మాదిగ, రాజరాపు కిరణ్ మాదిగ, పాల్గొన్నారు.