వరంగల్, ఫిబ్రవరి 21 : కుల వృత్తులను ప్రోత్సహించాలన్న సంకల్పంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 2 కోట్లతో అత్యాధునిక హంగులతో ఏర్పాటు చేసిన ల్యాండ్రోమార్ట్ (మోడ్రన్ ధోబీఘాట్) నిరుపయోగంగా మారింది. రూ.కోట్ల విలువ చేసే వా షింగ్ మిషన్లు పాడైపోతున్నాయి. స్మార్ట్ సిటీ నిధులతో నిర్మించిన మోడ్రన్ ధోబీఘాట్‌ను 2023 ఆగస్టులో అప్పటి పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ప్రా రంభించారు. తర్వాత వచ్చిన కాంగ్రెస్ సర్కారు ల్యాండ్రోమార్ట్ను పట్టించుకోవడం లేదు. నిర్మాణం పూర్తయినా వినియోగంలోకి తీసుకరావడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. అత్యాధునిక వాషింగ్మిషన్లతో ఏర్పాటు చేసిన ల్యాండ్రోమార్ట్ రెండున్నరేళ్లుగా మూతపడే ఉంటున్నది.
అయితే, ల్యాండ్రోమార్ట్ నిర్వహణను బీసీ కార్పొరేషన్‌కు అప్పగించాల్సి ఉండగా, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వరంగల్, హనుమకొం డ ప్రాంతాల్లోని రజక కులస్తులకు ఎంతో ఉపయోగంగా ఉండే ల్యాండ్రోమార్ట్ను ఇంకా వినియోగంలోకి తీసుకరాకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రజక కుటుంబాలకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి రోజూ 1100 జతల బట్టలు ఉతికే సామర్థ్యంతో నిర్మించిన ల్యాండ్రోమార్ట్ ప్రస్తుతం నిరుపయోగంగా మారింది. రెండున్నరేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోక పోవడంపై రజక సంఘాలు మండిపడుతున్నాయి.
పట్టించుకోని ప్రజాప్రతినిధులు
శిథిలావస్థకు చేరుకుంటున్న ల్యాండ్రోమార్ట్ను ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు. రజకులకు ఉపాధి కల్పించేందుకైనా అందుబాటులోకి తీసుకరావాలన్న ఆలోచనలు చేయడం లేదు. అధికార పార్టీకి చెందిన అదే సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్సీ ఉన్నా ల్యాండ్రోమార్ట్ రెండున్నరేళ్లుగా నిరుపయోగంగా ఉండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా మూత పడి ఉన్న ల్యాండ్రోమార్ట్ను అందుబాటులోకి తీసుకొచ్చి రజకులకు ఉపాధి కల్పించాలని కోరుతున్నారు.