జూలూరుపాడు, ఆగస్టు 04 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని కాకర్ల గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల అభివృద్ధికి దాతలు తమ ఉదారతను చాటుకున్నారు. పాఠశాల ప్రాంగణ రక్షణ, విద్యార్థుల భద్రతను కాంక్షిస్తూ ఫెన్సింగ్ పోల్స్‌తో కూడిన జాలి వాల్ ను ఏర్పాటు చేశారు. దివంగత చావా గౌరమ్మ జ్ఞాపకార్థం వారి కుమారుడు, ఎక్సైజ్ సి.ఐ చావా నాగేశ్వరరావు రూ.10,000/-లు, దివంగత కంచర్ల పురుషోత్తం జ్ఞాపకార్థం వారి కుమారుడు కంచర్ల శ్రీనివాసరావు రూ.10,000/-ల ఆర్థిక సహాయాన్ని అందించారు. స్థానిక నాయకులు మిర్యాల రమేష్ ప్రత్యేక సహకారంతో ఈ ఫెన్సింగ్ నిర్మాణం విజయవంతంగా పూర్తయింది. విద్యార్థుల సంక్షేమం, పాఠశాల వసతుల మెరుగుదలకు స్వచ్ఛందంగా ముందుకొచ్చిన దాతలకు ఉపాధ్యాయ బృందం, గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయుడు పుల్లారావుతో పాటు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.