కాల్వశ్రీరాంపూర్, ఫిబ్రవరి 21 : పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం పెద్దరాత్పల్లిలో నలుగురు శిశువులను విక్రయించారన్న విషయం కలకలం సృష్టించింది. గ్రామంలోని ఓ సామాజిక వర్గానికి చెందిన వారు నలుగురు శిశువులను విక్రయించినట్టు సమాచారం అందుకున్న జిల్లా వైద్యాధికారి ప్రమోద్కుమార్తో పాటు రెవెన్యూ, శిశు సంక్షేమశాఖ అధికారులు శనివారం పెద్దరాత్పల్లి పల్లె దవాఖానలో విచారణ చేపట్టారు.
గ్రామానికి చెందిన నలుగురు గర్భిణులు పెద్దపల్లి మాతా శిశు ఆరోగ్యకేంద్రంలో ఇటీవల ప్రసవించారు. వీరిలో ముగ్గురు డిశ్చార్జి అయ్యాక శిశువులను అక్కడే అమ్ముకున్నారన్న విషయమై సమాచారం అందుకున్న వైద్యాధికారి పెద్దరాత్పల్లి, కూనారంలో విచారణ చేపట్టారు. బాలల హక్కుల సంరక్షణాధికారి కనకరాజు మాట్లాడుతూ.. శిశు విక్రయ సమాచారంతో విచారణ చేపట్టినట్టు చెప్పారు. ఇద్దరిని గుర్తించామని, మరో బాలుడిని గుర్తించి దవాఖానకు తీసుకువచ్చామని చెప్పారు.