ప్రొటీన్ మన శరీరానికి రోజూ అవసరం. కానీ, ప్రతి భోజనంలోనూ శరీరానికి ప్రొటీన్లను సమకూర్చే ఆహార పదార్థాలు ఉండటం లేదు. మాంసం, పప్పులను చేర్చిన సమతులాహారం తినేవాళ్లు చాలా తక్కువ. అందువల్ల ప్రొటీన్ లోపంతో బాధపడుతున్నవాళ్లు ఎక్కువగా ఉన్నారు. ముఖ్యంగా శాకాహారుల్లో ఎక్కువగా ఉన్నారు. శరీరంలో ప్రొటీన్ లోపం సరి చేసుకోవడానికి ప్రతి భోజనంలో పెరుగును చేర్చుకుంటే ఆ లోటుని కొంత భర్తీ చేయవచ్చని ఐసీఎంఆర్, ఎన్ఐఎన్ సంస్థలు సూచిస్తున్నాయి. వంద గ్రాముల పెరుగులో కనీసం మూడు గ్రాముల ప్రొటీన్ ఉంటుందని, పాల స్వభావాన్ని బట్టి అంతకంటే ఎక్కువా ఉండొచ్చని ఆ సంస్థలు చెబుతున్నాయి.
కాబట్టి ప్రొటీన్ కోసం పెరుగు తినాలని ఈ సంస్థలు అంటున్నాయి. వంద గ్రాముల పెరుగు.. 62 కేజీల బరువు ఉండే సగటు మనిషికి ఒక రోజుకు కావాల్సిన ప్రొటీన్ అవసరంలో ఎనిమిది శాతమే తీరుస్తుంది. కాబట్టి శాకాహారులు పూర్తి స్థాయిలో అవసరమైన ప్రొటీన్లను పొందాలంటే చియా, అవిసె గింజల పొడిని పెరుగులో కలుపుకొని తినాలి. ఇలా చేస్తే శరీర కండరాలు బలంగా ఉంటాయి. రోగ నిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది. వంద గ్రాముల పెరుగులో 149 మిల్లీ గ్రాముల క్యాల్షియం, నాలుగు గ్రాముల కొవ్వులు, 93 మిల్లీ గ్రాముల ఫాస్పరస్, విటమిన్ బీ12, మెగ్నీషియం ఉన్నాయి. కాబట్టి పెరుగు తీసుకుంటే కండరపుష్టితోపాటు ఎముకల దృఢత్వం పెరుగుతుంది.