Iranian ship : అమెరికా-ఇరాన్ మధ్య ఘర్షణ ఇంకా కొనసాగుతూనే ఉంది. రెండు దేశాలు పరస్పరం దాడులు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా హార్ముజ్ జలసంధి వద్ద ఇరాన్ వాణిజ్య నౌకపై దాడి జరిగింది. ఈ ఘటనలో ఒకరు మరణించగా, మరో ముగ్గురు గాయపడ్డారు. ఈ ఘటన జలసంధి పరిధిలోని క్వెష్మ్ ఐలాండ్ సమీపంలో ఆదివారం జరిగింది. క్వెష్మ్, హెంగామ్ ఐలాండ్ తీరంలో ఉదయం ఐదు గంటల సమయంలో ఈ దాడి జరిగిందని ఇరాన్ మీడియా వెల్లడించింది.
బ్రిటన్‌కు చెందిన యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ కూడా ఈ విషయాన్ని నిర్ధరించింది. ఇరాన్ వాణిజ్య నౌకపై ఒక వస్తువుతో దాడి జరిగిందని ఈ సంస్థ తెలిపింది. అయితే, పూర్తి వివరాల్ని వెల్లడించలేదు. అమెరికా సైన్యం కూడా ఈ దాడిపై ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఇరాన్ వాణిజ్య నౌకల్ని లక్ష్యంగా చేసుకుని ఇటీవల అమెరికా దాడులు నిర్వహిస్తోంది. హార్ముజ్ జలసంధిని అధీనంలో ఉంచుకోవడం, ఇరాన్ పోర్టుల్ని అడ్డుకోవడం వంటి చర్యల్లో భాగంగా ఇరాన్ ఈ పని చేస్తోంది. శనివారం రాత్రి హార్ముజ్ జలసంధిలోని క్వెష్మ్ ఐలాండ్‌లో అనేక దాడులు, పేలుళ్లు జరిగినట్లు సమాచారం. దీంతో అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తత ఇంకా కొనసాగుతూనే ఉంది.
మరోవైపు హార్ముజ్ జలసంధిని పూర్తిగా తెరిచే అంశంపై ఒమన్‌లో గల్ఫ్ దేశాలతో ఇరాన్ చర్చలు జరుపుతోంది. ఈ జలసంధి నుంచే ప్రపంచంలో అత్యధిక వాణిజ్య నౌకలు రవాణా అవుతుంటాయి. అందువల్ల అంతర్జాతీయ చమురు రవాణాకు కూడా ఈ జలసంధి మార్గం కీలకం. ఈ జలసంధిపై అన్ని హక్కులు తమకే ఉన్నాయని ఇరాన్ చెబుతోంది. ఇక్కడ్నుంచి వెళ్లే నౌకలపై ఛార్జీలు వసూలు చేసేందుకు ఇరాన్ సిద్ధమైంది. ఆరు నెలలుగా సాగుతున్న ఇరాన్ యుద్దం వల్ల ఈ మార్గంలో నౌకల రవాణాకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. దీని కారణంగా చమురు ధరలు వంద డాలర్లకు పెరిగాయి. అనేక దేశాలు చమురు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి.