ప్రకృతికి విరుద్ధంగా పనిచేస్తూ దేశానికి వెలుగులు అందిస్తున్న సింగరేణి కార్మికులు, కుటుంబ సభ్యులు భయం గుప్పిట్లోనే కాలం వెల్లదీస్తున్నారు. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని యైటింక్లయిన్‌కాలనీ, రామగిరి మండలం సెంటినరీకాలనీలోని సింగరేణి క్వార్టర్లు శిథిలావస్థకు చేరగా, నిత్యనరకం అనుభవిస్తున్నారు. డ్యూటీకి వెళ్లి ఏ బొగ్గు పెల్ల మీద పడి ప్రాణాలు పోతాయోనని ఓ వైపు దినదిన గండంగా పనిచేస్తూ, ఇంటికి వస్తే ఎప్పుడు ఏ పెచ్చు మీద పడుతుందోనని బిక్కుబిక్కుమంటున్నారు. వానొస్తే పై కప్పులు ఉరుస్తూ, డ్రైనేజీలు సరిగా లేక మురుగునీరంతా ఇండ్లలోకి చేరుతుండడంతో ఇబ్బంది పడుతున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు దాదాపు 10వేల మంది కార్మిక కుటుంబాలు తిప్పలు పడుతున్నా, పట్టని అధికారుల తీరుపై మండిపడుతున్నారు.
పెద్దపల్లి, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): రామగుండం డివిజన్ పరిధిలోని ఆర్జీ-1, ఆర్జీ-2, ఆర్జీ-3, ఏఎల్పీలో పని చేస్తున్న దాదాపుగా 10వేల మందికి పైగా కార్మికులు, అధికారుల కోసం 1975లో యైటింక్లయిన్‌కాలనీ, రామగిరి మండలం సెంటినరీకాలనీలోని సింగరేణి క్వార్టర్లు నిర్మించారు. రేకులతో నిర్మించిన 670 టీ-1 క్వార్టర్లు ఇప్పటికే 50ఏళ్లు పూర్తి కాగా, 1980ప్రాంతంలో నిర్మించిన 1580 టీ-2 స్లాబ్ ఇండ్లు 45ఏళ్లు పూర్తి చేసుకున్నాయి. 1993లో నిర్మించిన 2170 జీ ప్లస్-1 సిరికె క్వార్టర్లు 30ఏండ్లు పూర్తి చేసుకున్నాయి.
2006లో నిర్మించిన 1500 జీ ప్లస్-1 ఎండీ క్వార్టర్లు 20ఏండ్లు పూర్తి చేసుకున్నాయి. అలాగే ఆర్జీ-3 పరిధిలోని రామగిరి మండలం సెంటినరీకాలనీలో 1995లో నిర్మించిన 2800 క్వార్టర్లకు, సూపర్వైజర్ల కోసం నిర్మించిన 300 ఎస్సీ-2లు, 70 ఎంసీ క్వార్టర్లకు, ఆఫీసర్ల కోసం నిర్మించిన 400 వరకు ఏబీసీ టైప్ క్వార్టర్లకు 30ఏళ్లు నిండాయి. అలాగే ఆర్జీ-1 పరిధి గోదావరిఖనిలోని తిలక్‌నగర్, విఠల్ నగర్, గాంధీనగర్‌లో నిర్మించిన డీ టైప్, టీ-1లు, టీ-2లు సైతం 30 ఏండ్లకుపైగా కావడంతో పెచ్చులూడుతున్నాయి. క్వార్టర్లలో ఉంటున్న తమ కుటుంబసభ్యులపై పడి గాయపడిన ఘటనలు అనేకం ఉన్నాయని కార్మికులు వాపోతున్నారు. ఇలా గోదావరిఖనిలో దాదాపుగా 4వేలకు పైగా క్వార్టర్లు శిథిలావస్థలో మగ్గుతుండగా, అధికారులు, కుటుంబ సభ్యులు, కార్మికులు, వారి కుటుంబ సభ్యులు భయం భయంగా బతుకీడుస్తున్నారు.
చినుకు పడితే వణుకే..
యైటింక్లయిన్‌కాలనీ, గోదావరిఖని, సెంటినరీకాలనీల్లోని సింగరేణి క్వార్టర్లు 80శాతం వరకు శిథిలావస్థకు చేరుకున్నాయి. వానకాలం వచ్చిందంటే చాలు ఇంట్లో ఎక్కడ ఏ పదనకు ఏ షాక్ వస్తుందోనని కార్మికులు, కార్మికుల కుటుంబ సభ్యులు జంకుతున్నారు. దీనికితోడు నిర్మాణ సమయంలో చిన్న చిన్న పైపులను వాడడం వర్షపు నీరు డ్రైనేజీల నుంచి మరుగుదొడ్లల్లోకి, మరుగుదొడ్ల నుంచి ఇంటిలోకి చేరుతున్నది. అలాగే శ్లాబులు పెచ్చులూడి పడుతున్నాయని, గోడలు పగుళ్లు తేలి ఉన్నాయని వాపోతున్నారు. సింగరేణిలోని సివిల్ వర్క్స్ డిపార్ట్మెంట్ వాళ్లు నెల నెలా పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు చేస్తున్నట్టు చూపుతున్నా.. మరమ్మతులను మమ అనిపిస్తున్నారని కార్మికులు ఆరోపిస్తున్నారు.
సంక్షేమాన్ని మరచిన సర్కార్
కార్మికులను కడుపులో పెట్టి చూసుకుంటామంటూ కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి, సంక్షేమాన్ని పూర్తిగా మరచిపోయింది. సింగరేణి నిధులను పెద్ద ఎత్తున దుబారాగా ఖర్చు చేస్తున్నప్పటికీ కార్మికుల సంక్షేమాన్ని మాత్రం పట్టించుకోవడం లేదు. సింగరేణి సంక్షేమమే ధ్యేయంగా పనిచేసిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్.. కార్మికుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇన్‌కం టాక్స్ కట్టే సింగరేణి కార్మికుడు ఇలాంటి దుర్భరమైన ఇండ్లల్లో ఉండడం సరికాదని సంక్షేమంవైపు అడుగులు వేశారు. ప్రతి కార్మికుడు సకల సౌకర్యాలు కలిగిన డబుల్ బెడ్రూం ఇండ్లలో నివసించాలని ఆకాంక్షించారు. ఇందులో భాగంగా సింగరేణి వ్యాపించి ఉన్న భూపాలపల్లిలో దాదాపు 1000, సత్తుపల్లిలో 400, కొత్తగూడెంలో 200 డబుల్ బెడ్రూం సింగరేణి క్వార్టర్లను నిర్మించారు. ఇంకా సింగరేణి వ్యాప్తంగా శిథిలమైన క్వార్టర్ల స్థానంలో నూతన డబుల్ బెడ్రూం క్వార్టర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టగా, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు.
మరమ్మతులు వద్దు.. కొత్త ఇండ్లు నిర్మించాలి
కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల సంక్షేమాన్ని ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఇన్‌కం ట్యాక్స్ కట్టే సింగరేణి కార్మికుడు కనీస సౌకర్యాలు లేని కాలం చెల్లిన క్వార్టర్లలో అవస్థలు పడుతూ ఉంటున్నారు. డ్యూటీకి వస్తే ప్రశాంతంగా పనిచేయలేకపోతున్నారు. ఎవరైనా ఇంటికి బంధువులు వస్తే ఉండే పరిస్థితి లేదు. కనీసం స్నానాలకు కూడా నీళ్లు సరిగా ఉండవు. సివిల్ వర్క్స్ పేరుతో పెద్ద ఎత్తున డబ్బు వృథాగా ఖర్చు చేస్తున్నారు. డ్రైనేజీలు, డోర్స్, ఇతర మరమ్మతులు సరిగా చేయడం లేదు. దానికి బదులు కాలం చెల్లిన ఇండ్లను కూల్చి కొత్త ఇండ్లను నిర్మించాలి. 30 నుంచి 40 ఏండ్లు నిండిన క్వార్టర్లను పూర్తిగా తొలగించి తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ భూపాలపల్లి, సత్తుపల్లి, కొత్తగూడెంలో నిర్మించిన విధంగా ఇక్కడి కార్మికులకు డబుల్ బెడ్రూం క్వార్టర్లను నిర్మించి ఇవ్వాలి.
– మిర్యాల రాజిరెడ్డి, అధ్యక్షుడు టీబీజీకేఎస్ (రామగుండం)
నరకయాతన అనుభవిస్తున్నాం
సింగరేణి క్వార్టర్లలో మేం నాలుగేళ్లుగా ఉంటున్నాం. మా క్వార్టర్ నంబర్ ఎస్టీ-2 2565. చిన్న పాటి వర్షం వస్తే చాలు ఇంట్లోకి నీళ్లు వచ్చేస్తాయి. అయితే డ్రైనేజీ పైపుల ద్వారా, మరుగుదొడ్డి ద్వారా ఇంట్లోకి దుర్గంధం అంతా చేరుతుంది. నేను, నా భార్య పిల్లలం చాలా అవస్థలు పడుతున్నాం. సివిల్ వారికి చెప్పినా ఇదే పరిస్థితి. సర్దుకపోవడం తప్ప మరో మార్గం లేదు. వర్షం పడితే ఇక ఆ రోజంతా మా ఇంట్లో ఎవరూ నిద్రపోరు. బాత్రూం నుంచి నీరు వచ్చి బెడ్రూం, హాల్, కిచెన్ అన్నింట్లోకి చేరుతున్నది. చాలా నరకయాతన అనుభవిస్తున్నాం.
– నాయిని ధర్మేందర్, జనరల్ అసిస్టెంట్, ఓసీపీ-1 (రామగుండం-3 ఏరియా)