Philippines President : ఫిలిప్పైన్స్ అధ్యక్షుడు (Philippines President) ఫెర్డినాండ్ ఆర్ మార్కోస్ జూనియర్ (Ferdinand R Marcos Jr) ఆగస్టు 4 నుంచి భారత్ (India) లో పర్యటించనున్నారు. ఆగస్టు 4 నుంచి 8 వరకు పర్యటన కొనసాగనుంది. ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) ఆహ్వానం మేరకు ఆయన భారత్‌కు వస్తున్నారు. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ (Foreign Ministry) ఒక ప్రకటనలో వెల్లడించింది.
ఫిలిప్పైన్స్ అధ్యక్షుడు మార్కోస్తోపాటు ఆయన సతీమణి మడామే లూయిస్ ఆరనేటా మార్కోస్ (Madame Louise Araneta Marcos) కూడా భారత్‌కు రానున్నారు. వారితోపాటు పలువురు క్యాబినెట్ మంత్రులు, ఉన్నతాధికారులు, వ్యాపార ప్రతినిధులతో కూడిన ఉన్నతస్థాయి బృందం కూడా వారితోపాటు భారత్‌కు రానుంది. ఆగస్టు 8న బెంగళూరులో పర్యటించి ఫిలిప్పైన్స్కు తిరుగు ప్రయాణం కానున్నారు.
కాగా మార్కోస్ ఫిలిప్పైన్స్ అధ్యక్షుడు అయిన తర్వాత భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. పర్యటనలో భాగంగా మార్కోస్ ఆగస్టు 5న ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అయ్యి పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించనున్నారు. అదేవిధంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌లతో కూడా మార్కోస్ భేటీ కానున్నారు. కాగా భారత్, ఫిలిప్పైన్స్ మధ్య 1949 నవంబర్ నుంచి దౌత్య సంబంధాలు మొదలయ్యాయి.
అప్పటి నుంచి రెండు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, భద్రత, సముద్ర సహకార, వ్యవసాయ, ఆరోగ్య, ఫార్మా, డిజిటల్ టెక్నాలజీ రంగాల్లో పరస్పర సంబంధాలు బలపడుతూ వస్తున్నాయి.