మెదక్, ఫిబ్రవరి 21(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పాలనలో రైతులకు అరిగోస తప్పడం లేదు. ప్రభుత్వ చేయూత కరువు కావడంతో వ్యవసాయం చేయడం రైతులకు భారంగా మారుతున్నది. ఈ ఏడాది కొండపోచమ్మ సాగర్ నుంచి హల్దీవాగులోకి నీటిని విడుదల చేయక పోవడంతో మెదక్ జిల్లా రైతులు సాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నీళ్ల కోసం రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ సర్కార్ కోట్లాది రూపాయలతో హల్దీవాగుపై 12 చెక్‌డ్యామ్‌లు నిర్మించి రైతులకు మేలు చేసింది. చెక్‌డ్యామ్‌ల నిర్మాణంతో భూగర్భ జలాలు వృద్ధి చెందడంతో పాటు హల్దీవాగులో నీళ్లు నిల్వ ఉండి సాగునీటికి అనుకూలంగా మారింది. దీంతో బీఆర్ఎస్ హయాంలో హల్దీవాగు పరీవాహక రైతులు పుష్కలంగా పంటలు పండించుకున్నారు.
బీఆర్ఎస్ హయాంలో వాగు కళకళ
బీఆర్ఎస్ ప్రభుత్వం ఏటా ఫిబ్రవరిలోనే హల్దీ వాగులోకి మల్లన్నసాగర్ నీటిని విడుదల చేసేది. దీంతో యాసంగి సాగుకు రైతులకు ఇబ్బంది ఎదురుకాలేదు. ప్రస్తుతం వాగులో నీరులేకపోవడంతో రైతులు వేసిన పంటలు ఎండిపోతున్నాయి. పొలాలు నెర్రెలు వారుతున్నాయి. హల్దీవాగులోకి కొండపోచమ్మ సాగర్ నుంచి నీటిని విడుదల చేయాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి ఇటీవల ప్రభుత్వానికి లేఖ రాసినా స్పందించలేదు. రైతులు అధికారులకు వినతి పత్రాలు అందజేయడంతో పాటు ఆందోళనలు చేస్తున్నారు. వాల్దీవాగులోకి నీటిని విడుదల చేయకపోవడంతో భూగర్భ జలాలు తగ్గిపోయి వ్యవసాయ బోరుబావుల్లో నీటిమట్టం తగ్గి పంటలకు సాగునీరు అందడం లేదు. దీంతో పాటు కరెంట్ సమస్య వేధిస్తుండడంతో పంటలు ఎండిపోతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మెదక్ జిల్లాలోని తూప్రాన్, వెల్దుర్తి, చిన్నశంకరంపేట, చేగుంట, కొల్చారం, మాసాయిపేట ప్రాంతాల్లో చెక్‌డ్యామ్‌లు ఎండిపోయి కనిపిస్తున్నాయి. హల్దీవాగు ప్రాజెక్టు ద్వారా 2900 ఎకరాలకు సాగునీరు అందడం లేదు. ఒక్క హల్దీ వాగుపై ఉన్న చెక్‌డ్యామ్‌ల ద్వారానే వేల ఎకరాల్లో రైతులు పంటలు సాగుచేస్తున్నారు.

పంటలు ఎండుడే..
హల్దీవాగులోకి విడుదల చేయకపోతే పంటలు ఎండిపోయే ప్రమాదం ఉంది. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఫిబ్రవరిలోనే నీటిని విడుదల చేసేవారు. మే వరకు వాగులో పుష్కలంగా నీరు ఉండడంతో పాటు భూగర్భ జలాలు పెరిగి యాస ంగి పంటలు పండాయి. రైతులు వేల రూపాయలు ఖర్చు చేసి పంటలు సాగుచేశారు. ప్రస్తతం నీరు లేక పంటలు ఎండిపోతున్నాయి. కొందరు రైతులు అప్పులు చేసి పంటలు సాగు చేశారు. నీరు లేకపోవడంతో చేసిన అప్పులు ఎలా తీర్చాలని రైతులు ఆందోళన చెందుతున్నారు. గ్రామాల్లో పగటి వేళ పొలాల్లో తిరిగితే ఎండిపోయిన వరి, మొక్కజొన్న పంటలు కనిపిస్తున్నాయి. పశువులకు కూడా తాగునీరు దొరకని పరిస్థితి ఉందని రైతులు చెబుతున్నారు. కొండపోచమ్మ సాగర్ నుంచి హల్దీవాగులోకి నీటిని విడుదల చేయకపోతే 40 వేల ఎకరాల్లో పంటలకు నష్టం జరిగే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా నీటిని విడుదల చేయలని ప్రభుత్వాన్ని రైతులు కోరుతున్నారు.
వెంటనే నీటిని విడుదల చేయాలి
రైతులు సాగు చేస్తున్న పంటలను కాపాడేందుకు హల్దీవాగులోకి నీటిని విడుదల చేయాలి. వాగులో నీరు లేకపోవడంతో భూగర్భ జలాలు తగ్గిపోయాయి. బోరుబావుల్లో నీటిమట్టం తగ్గి పంటలకు నీరందించేందుకు ఇబ్బందులు తప్పుడం లేదు. బీఆర్ఎస్ హయాంలో ప్రతి ఏడాది హల్దీవాగులోకి కొండపోచమ్మ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేసేవారు. పంటలకు సాగునీటి ఇబ్బందులు ఉండేవి కావు. రాష్ట్ర ప్రభుత్వం నీటిని విడుదల చేయకపోవడం, కరెంట్ సమస్య ఉండడంతో ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం వెంటనే నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలి.
– కిచ్చుగారి శ్రీనివాస్, రైతు, వెల్దుర్తి, మెదక్ జిల్లా
బీఆర్ఎస్ హయాంలో పుష్కలంగా నీళ్లు
బీఆర్ఎస్ హయాంలో హల్దీవాగులోకి సకాలంలో కొండపోచమ్మ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడంతో రైతులకు ఇబ్బందులు ఉండేవి కావు. యాసంగిలో రైతులు వరితో పాటు ఇతరు పంటలు సాగు చేస్తున్నారు. హల్దీవాగులో నీరు లేకపోవడంతో పంటలకు సాగునీరు అందించేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నీటిని విడుదల చేయాలి. రైతుల పక్షాన బీఆర్ఎస్ పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉంది.
– బాబుల్‌రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తూప్రాన్, మెదక్ జిల్లా