Prashant Kishor : బీహార్ ఓటర్ల (Bihar voters) ను ప్రతిపక్ష కాంగ్రెస్ (Congress), అధికార బీజేపీ (BJP) పార్టీలు తప్పుదోవ పట్టిస్తున్నాయని ఎన్నికల వ్యూహకర్త, జన్ సూరజ్ పార్టీ (Jan Suraj Party) అధినేత ప్రశాంత్ కిశోర్ (Prashant Kishor) విమర్శించారు. ఆ రెండు పార్టీలు ప్రజలు ఎదుర్కొంటున్న నిజమైన సమస్యలను వదిలేసి ‘ఓట్ చోరీ (Vote Chori)’ పైనే పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయని మండిపడ్డారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆర్జేడీ సూచనల ప్రకారమే నడుచుకుంటున్నారని, బీహారీల సమస్యలపై మాత్రం ఆయన దృష్టి పెట్టడంలేదని ప్రశాంత్ కిషోర్ ఆరోపించారు. ఎన్నికల వేళ రాహుల్ గాంధీని ప్రధాని నరేంద్ర మోదీ, ప్రధాని నరేంద్ర మోదీని రాహుల్ గాంధీ పరస్పరం విమర్శించుకుంటున్నారని ప్రశాంత్ కిషోర్ చెప్పారు. అదంతా ఆ రెండు పార్టీలు ఆడుతున్న నాటకమని, ఆ నాటకం ఉచ్చులో మీరు పడొద్దని ప్రజలకు పిలుపునిచ్చారు.
పేదరికం, నిరుద్యోగం, వలసలు, సరైన విద్యా సౌకర్యాలు లేకపోవడం లాంటివి బీహార్లో అసలైన సమస్యలని, ప్రధాన పార్టీలు ఈ సమస్యలను గాలికి వదిలేశాయని ప్రశాంత్ కిశోర్ విమర్శించారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకే ప్రధాన పార్టీలకు ప్రత్యామ్నాయంగా తాను ‘జన్ సూరజ్ పార్టీ’ ని స్థాపించానని చెప్పారు.