Coconut Oil | కొబ్బరినూనెను భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచే వాడుతున్నారు. చాలా మంది కొబ్బరినూనెను వంటల తయారీలో ఉపయోగిస్తారు. ఆయుర్వేదంలో దీనికి ఎంతో ప్రాధాన్యతను కల్పించారు. కొబ్బరినూనెలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. దీన్ని పలు ఆయుర్వేద ఔషధాల తయారీలోనూ ఉపయోగిస్తారు. అయితే కొబ్బరినూనెను రాత్రి పూట సేవించడం వల్ల అనేక లాభాలు కలుగుతాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. రాత్రి పూట 1 టేబుల్ స్పూన్ మోతాదులో కొబ్బరినూనెను నిద్రకు ముందు సేవించాలి. అనంతరం ఒక గ్లాస్ గోరు వెచ్చని నీళ్లను తాగాలి. ఇలా చేస్తే అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని అంటున్నారు. కొబ్బరినూనెను ఇలా తాగడం వల్ల పలు వ్యాధులు నయం అవుతాయని ఆయుర్వేద వైద్యులు సూచిస్తున్నారు.
కొబ్బరినూనెలో మీడియం చెయిన్ ట్రై గ్లిజరైడ్స్ (ఎంసీటీ) ఉంటాయి. లారిక్ యాసిడ్ ఇదే కోవకు చెందుతుంది. ఇది కొబ్బరినూనెలో అధికంగా ఉంటుంది. అందువల్ల కొబ్బరినూనెను రాత్రి పూట సేవిస్తుంటే పైత్య రసం సక్రమంగా ఉత్పత్తి అవుతుంది. దీంతో మనం తిన్న ఆహారంలో ఉండే కొవ్వు పదార్థాలను శరీరం సక్రమంగా జీర్ణం చేస్తుంది. అజీర్తి ఏర్పడకుండా ఉంటుంది. కొబ్బరినూనెను రాత్రి పూట సేవించడం వల్ల జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. జీర్ణాశయ గోడలపై ఉండే మ్యూకస్ పొరకు రక్షణ లభిస్తుంది. జీర్ణవ్యవస్థలో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. దీని వల్ల జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. మలబద్దకం ఉన్నవారు రాత్రి పూట కొబ్బరినూనెను సేవిస్తుంటే ఎంతగానో ప్రయోజనం ఉంటుంది. మరుసటి రోజు సుఖ విరేచనం అవుతుంది. అయితే కొబ్బరినూనెను రాత్రి పూట మాత్రమే తాగాలి. ఎందుకంటే ఇది సహజసిద్ధమైన విరేచనకారిగా పనిచేస్తుంది. దీన్ని ఉదయం లేదా పగలు తాగితే తరచూ విరేచనం అయ్యే అవకాశం ఉంటుంది. కనుక రాత్రి నిద్రకు ముందు మాత్రమే దీన్ని తాగాల్సి ఉంటుంది.
కొబ్బరినూనె సహజసిద్ధమైన సెడేటివ్ గుణాలను కలిగి ఉంటుంది. అంటే దీన్ని తాగితే నిద్ర బాగా వస్తుంది. కనుక రాత్రి పూట మాత్రమే దీన్ని తాగాలి. పగటి పూట తాగితే మీ పనికి ఆటంకం కలిగే అవకాశం ఉంటుంది. నిద్ర మత్తు విపరీతంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. రాత్రి పూట ఈ నూనెను తాగితే ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. మైండ్ రిలాక్స్ అవుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. దీంతో పడుకున్న వెంటనే నిద్ర పడుతుంది. గాఢ నిద్రలోకి జారుకుంటారు. నిద్రలేమి నుంచి బయట పడవచ్చు. రాత్రి పూట కొబ్బరినూనెను సేవిస్తుంటే అందులో ఉండే ఎంసీటీలు రాత్రంతా మీ షుగర్ లెవల్స్‌ను నియంత్రణలో ఉంచుతాయి. దీని వల్ల మరుసటి రోజు ఉదయం ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవల్స్ పెరగకుండా ఉంటాయి. దీంతో డయాబెటిస్ అదుపులో ఉంటుంది. పైగా నిద్రపై ప్రభావం పడకుండా, రాత్రి పూట మాటి మాటికీ నిద్ర లేవకుండా ఉంటారు.
కొబ్బరినూనెలో ఉండే ఎంసీటీలు శరీర మెటబాలిజం ప్రక్రియను వేగవంతం చేస్తాయి. దీంతో లివర్‌లో ఉండే కొవ్వు కరిగిపోతుంది. లివర్ శుభ్రంగా మారుతుంది. అలాగే రాత్రిపూట మీరు నిద్రలో ఉన్నప్పటికీ శరీరం క్యాలరీలు ఖర్చు చేస్తూనే ఉంటుంది. దీంతో కొవ్వు కరుగుతుంది. బరువు తగ్గుతారు. అధికంగా బరువు ఉన్నవారు కొబ్బరినూనెను ఇలా తీసుకుంటుంటే ఎంతగానో ప్రయోజనం లభిస్తుంది. కొబ్బరినూనెను చాలా మంది నేరుగా చర్మం లేదా శిరోజాలకు రాస్తారు. కానీ జిడ్డుగా ఉంటుందని భావించేవారు ఈ నూనెను రాయాల్సిన పనిలేదు. నేరుగా రాత్రి పూట తాగవచ్చు. దీని వల్ల కూడా చర్మం, శిరోజాలు ఆరోగ్యంగా ఉంటాయి. చర్మం మృదువుగా మారి కాంతివంతంగా కనిపిస్తుంది. శిరోజాలు ఒత్తుగా పెరిగి దృఢంగా ఉంటాయి. ఇలా కొబ్బరినూనెతో అనేక లాభాలను పొందవచ్చు. అయితే కొబ్బరినూనెలో 90 శాతం మేర శాచురేటెడ్ కొవ్వు ఉంటుంది. కనుక హైబీపీ ఉన్నవారు, గుండె జబ్బుల బారిన పడిన వారు డాక్టర్ సూచన మేరకు దీన్ని తీసుకోవాల్సి ఉంటుంది. కొబ్బరినూనె కొందరికి పడదు. విరేచనాలు అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాంటి వారు కూడా దీన్ని తాగకూడదు.