IADT 01 : ప్రతిష్ఠాత్మక గగన్యాన్ మిషన్ (Gaganyaan Mission) దిశగా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) మరో కీలక మైలురాయిని అధిగమించింది. మానవసహిత అంతరిక్ష యాత్రలో వ్యోమగాముల భద్రతకు అత్యంత ముఖ్యమైన పారాచూట్ వ్యవస్థ (Parachute system) పనితీరును పరీక్షించేందుకు చేపట్టిన ‘ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్-01 (IADT-01)’ ను విజయవంతంగా పూర్తి చేసినట్లు ఇస్రో ప్రకటించింది.
ఈ ప్రయోగం గగన్యాన్ మిషన్ విజయానికి చాలా కీలకమైనదిగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అంతరిక్షం నుంచి భూమికి తిరిగి వచ్చే క్రమంలో వ్యోమగాములు ఉండే మాడ్యూల్ వేగాన్ని నియంత్రించి, దానిని సురక్షితంగా దించడం కోసం ఈ పారాచూట్ వ్యవస్థను ఉపయోగిస్తారు. ఈ వ్యవస్థ మొదటి నుంచి చివరి వరకు ఎలా పనిచేస్తుందో సమగ్రంగా నిరూపించేందుకే తాజా పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్ష ద్వారా పారాచూట్ వ్యవస్థ పనితీరును విజయవంతంగా ప్రదర్శించినట్లు ఇస్రో వర్గాలు వెల్లడించాయి.
ఈ కీలక ప్రయోగం ఇస్రో ఒక్కదానితో మాత్రమే కాకుండా దేశంలోని ప్రముఖ రక్షణ, పరిశోధనా సంస్థల సమష్టి కృషితో సాధ్యమైంది. భారత వైమానిక దళం (IAF), డీఆర్డీవో (DRDO), భారత నౌకాదళం (Indian Navy), ఇండియన్ కోస్ట్ గార్డ్ (ICG) ఈ పరీక్షలో ఇస్రోతో కలిసి పాలుపంచుకున్నాయి. ఈ సంస్థలన్నీ సమన్వయంతో పనిచేసి క్లిష్టమైన ప్రయోగాన్ని విజయవంతం చేశాయి. కాగా గగన్యాన్ మిషన్ ద్వారా వ్యోమగాములను సురక్షితంగా అంతరిక్షంలోకి పంపి, తిరిగి భూమికి తీసుకురావడమే లక్ష్యంగా ఇస్రో ముందుకు సాగుతోంది.