ERAM missiles : రష్యా సైన్యం దాడులతో సతమతమవుతున్న ఉక్రెయిన్‌కు అండగా నిలుస్తూ అగ్రరాజ్యం అమెరికా మరో భారీ ఆయుధ సాయాన్ని ప్రకటించింది. కీవ్ గగనతల రక్షణ వ్యవస్థను పటిష్ఠం చేసే లక్ష్యంతో 3,350కి పైగా అత్యాధునిక ‘ఎక్స్టెండెడ్ రేంజ్ అటాక్ మ్యూనిషన్ (ERAM)’ క్షిపణులను సరఫరా చేయబోతోంది. అందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఆమోదం తెలిపారు.
అయితే ఆ శక్తిమంతమైన ఆయుధాలను రష్యా భూభాగంపై ప్రయోగించాలంటే మాత్రం ఉక్రెయిన్ తప్పనిసరిగా పెంటగాన్ అనుమతి తీసుకోవాలని అమెరికా కీలక షరతు విధించింది. ఈ ఆయుధాల కొనుగోలుకు అవసరమైన నిధులను యూరోపియన్ దేశాలు సమకూరుస్తుండగా, రాబోయే ఆరు వారాల్లో ఆ క్షిపణులు ఉక్రెయిన్‌కు చేరనున్నాయి. కాగా 240 నుంచి 450 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం ఈ ERAM క్షిపణులకు ఉంది.
అయితే వీటి వినియోగంపై అమెరికా నియంత్రణ ఉంచడం చర్చనీయాంశమైంది. ఇప్పటికే రష్యాలోని లక్ష్యాలపై దాడి చేయడానికి అమెరికా అందించిన లాంగ్-రేంజ్ ఆర్మీ టాక్టికల్ మిస్సైల్ సిస్టమ్స్ (ATACMS) వాడకాన్ని పెంటగాన్ నిరోధిస్తోంది. ఈ నేపథ్యంలో కీవ్ ప్రతిదాడుల సామర్థ్యాన్ని అమెరికా పరిమితం చేస్తోందని పలు నివేదికలు చెబుతున్నాయి.
ఇదిలావుంటే తాజా సాయంలో భాగంగా అమెరికా మొత్తం 32.2 కోట్ల డాలర్ల ప్యాకేజీని ప్రకటించింది. ఇందులో 17.2 కోట్ల డాలర్లను ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే క్షిపణి వ్యవస్థల కోసం, మరో 15 కోట్ల డాలర్లను ఆర్మర్డ్ వాహనాల నిర్వహణ కోసం కేటాయించనున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడులు తీవ్రతరం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు.