Volodymyr Zelensky : ఉక్రెయిన్ అధ్యక్షుడు (Ukraine President) వొలోదిమిర్ జెలెన్ స్కీ (Olodymyr Zelensky) త్వరలో భారత్ (India) లో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని ఉక్రెయిన్ రాయబారి (Ukrainian Envoy) ఒలెక్సాండర్ పోలిష్ చుక్ (Oleksandr Polishchuk) వెల్లడించారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను మెరుగుపర్చుకోవడమే ఈ పర్యటన ఉద్దేశమని ఆయన చెప్పారు.
జెలెన్ స్కీ భారత పర్యటనకు సంబంధించి తేదీలను ఖరారు చేయడంపై కసరత్తు జరుగుతున్నట్లు పోలిష్ చుక్ తెలిపారు. గత ఏడాది ఆగస్టులో కీవ్‌ను సందర్శించిన ప్రధాని మోదీ.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీని భారత్‌కు ఆహ్వానించారు. ప్రధాని ఆహ్వానం మేరకు జెలెన్ స్కీ త్వరలో భారత్‌కు రానున్నారు. కాగా ప్రధాని మోదీ పలు సందర్భాల్లో ఉక్రెయిన్, రష్యా దేశాల మధ్య శాంతిని కోరుకుంటున్నట్లు చెప్పారు.
ఆ రెండు దేశాల మధ్య శాంతిని కాంక్షిస్తూ ఒకానొక సందర్భంలో ‘ఇది యుద్ధ యుగం కాదు’ అని నొక్కి చెప్పారు. పుతిన్, జెలెన్ స్కీతో టెలిఫోన్ సంభాషణలు కూడా జరిపారు. భారతదేశం రెండు దేశాల మధ్య శాంతిని కోరుకుంటుందని చెప్పారు. ఇదిలావుంటే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా ఈ ఏడాది చివరలో భారత్‌కు రాబోతున్నారు.