హైదరాబాద్, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ): రాజకీయంగా నిత్యం కత్తులు దూసుకునే ఇద్దరు కీలక నేతలు భూదాన్ భూముల్లో పేదల ఇండ్లు చెదరగొట్టే విషయంలో ఒకేమాట.. ఒకే బాటగా నడిచారా? దశాబ్దం క్రితం ఖమ్మం జిల్లాలోని మారుమూల ప్రాంతాల నుంచి పొట్టకూటి కోసం నగరానికి వచ్చి ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకోవడమే వారు చేసిన పాపమైందా? భూదాన్ భూముల్లో నివాసముంటున్న పేదలపై పెద్దలకు ఎందుకింత కంటగింపు అన్న అంశంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ నడుస్తున్నది. ‘భూదాన్ బోర్డు ఇచ్చిన పట్టాలు ఉన్నాయి మహాప్రభో’ అని చేతులెత్తి మొక్కినా కనికరించని అధికారులు, ఉన్నపళంగా బుల్డోజర్లతో విరుచుకుపడటం వెనుక ఖమ్మం జిల్లాకు చెందిన ఇద్దరు కీలక ప్రజాప్రతినిధుల హస్తం ఉన్నదన్న ప్రచారం జోరుగా సాగుతున్నది. ఆ ఇద్దరు కీలక నేతల అనుచరులకు సంబంధించిన భూములు ఆ ప్రాంతంలో ఉండటం.. భూదాన్ భూముల్లో పేదలు కట్టుకున్న గుడిసెలు, ఇండ్ల కారణంగా తమ భూములకు డిమాండ్ రావడం లేదన్న వ్యాపార కోణమే తమను నిరాశ్రయులుగా మార్చేందుకు ఉసిగొల్పినట్టు బాధితులు బోరున విలపిస్తున్నారు. వినియోగంలో లేని వినోభానగర్ భూదాన్ భూములకు నిరంతరం శ్రమించి ఒక రూపం తెచ్చాక.. నివాస యోగ్యమైన ప్రాంతంగా గుర్తింపు వచ్చాక ఇప్పుడు తమను మెడలు పట్టి గెంటివేశారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
ఆ 30 ఎకరాలు ఏమైనయ్?
ఖమ్మం అర్బన్ మండలం వెలుగుమట్లలో ని 147, 148, 149 సర్వే నంబర్లలో 60 ఎకరాల భూదాన్ భూమి ఉండాల్సి ఉండగా తాము గుడిసెలు నిర్మించుకున్నది కేవలం 30 ఎకరాల్లోనే అని అధికారులు చెప్తున్నారని, మరి మిగిలిన 30 ఎకరాలు ఏమయ్యాయని బాధితులు ప్రశ్నిస్తున్నారు. ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్ మాత్రం పేదలు ఇండ్లు కట్టుకున్న ప్రాంతం భూదాన్ భూములకు సంబంధించి 30.07 ఎకరాలని, ఇందు లో 9 మందికి కోర్టు స్టే ఉన్న కారణంగా వారి ఇండ్లను యథావిధిగా కొనసాగిస్తున్నామని మంగళవారం విలేకరుల ఎదుట స్పష్టంచేశారు.
భూముల కోసం పేదల ఇండ్లు పణం
కలెక్టరేట్‌కు కూతవేటు దూరంలో కాంగ్రెస్ కీలక ప్రజాప్రతినిధుల భూములు, వారి అనుచరుల భూములు పెద్దమొత్తంలో ఉన్నాయి. దీంతో దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే ఆలోచనతోనే పేదల ఇండ్లను అడ్డు తొలగించుకోవాలని కీలక నేతలకు వివరించడంతో ఈ కార్యాన్ని ఇరువురు ప్రజాప్రతినిధులు భు జాన వేసుకున్నట్టు ప్రచారం జరుగుతున్నది. రాజకీయంగా సన్నిహితంగా ఉన్న కొందరికి మేలు చేసేందుకు పేదల ఇండ్ల అడ్డు తొలగించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు రాళ్లూరప్పలు, గుట్టలుగా ఉన్న భూదాన్ భూ ముల పరిసరాలు ఇప్పుడు మినీ నగరంగా రూపొందడం.. కలెక్టరేట్‌తోపాటు వ్యాపార, వాణిజ్య సముదాయాలు నిర్మాణం కావడంతో ఈ భూములకు సమీపంలో భూములున్నవారు తమ పలుకుబడిని ప్రయోగించి ఇద్దరు ప్రజాప్రతినిధుల అండతో ఈ నిర్వాకానికి పా ల్పడినట్టు తెలుస్తున్నది.
పేదల ఇండ్లను కూ ల్చడం వల్ల కలిగే రాజకీయ నష్టంకన్నా ఇతర ప్రయోజనాలపైనే దృష్టి సారించి తమను రోడ్డు న పడేశారని నిర్వాసితులు ఆక్రోశిస్తున్నారు. కీలక ప్రజాప్రతినిధులకు ఇక్కడి భూములతో ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలు ఉండటం వల్లే పేదల గుడిసెలను పోలీసుల పహారాలో బాధితులు హాహాకారాలు చేస్తున్నా పట్టించుకోకుండా నేలమట్టం చేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పేదల ఇండ్లను నేలమట్టం చేసిన అధికారులు వారి సామాన్లను మరోచోటుకు చేర్చేందుకు రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా ప్రభుత్వపరంగానే వాహనాలు సమకూర్చడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటనేది తమకు అంతుచిక్కడం లేదని బాధితులు చెప్తున్నారు. భూదాన్ యజ్ఞ బోర్డు అక్కడ నివసిస్తున్న వారికి పట్టాలు అందజేసినా పరిగణనలోకి తీసుకోకుండా కూల్చడం ఏమిటంటూ ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
సమీపం నుంచే గ్రీన్‌ఫీల్డ్ హైవే
ఈ భూదాన్ భూముల సమీపం నుంచే నాగ్‌పూర్-అమరావతి గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మితమవుతుండటంతో పేదల ఇండ్లను నేలమట్టం చేసి వ్యాపార వాణిజ్య సామ్రాజ్యాన్ని నిర్మించాలన్న కొందరు బడాబాబుల ఆలోచనలకు ప్రభుత్వ పెద్దలు ‘చేయి’ అందించినట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. తాము నివాసం ఉంటున్న భూదాన్ భూముల గుడిసెలను క్రమబద్ధీకరించాలని కాంగ్రెస్ పెద్దలకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కనికరించలేదని, కనీసం తమగోడు వినిపించుకునే అవకాశం కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. తమ గుడిసెలను కూల్చివేసే కుట్ర దాగి ఉందన్న విషయం తమకు బోధపడలేదని కన్నీటిపర్యంతమవుతున్నారు.
అనుచరుల రుణం తీర్చుకుందామని..
ఎలాంటి కోర్టు ఆర్డరైనా పేదలకు అన్యాయం జరుగుతుంటే ఒక ప్రజాప్రతినిధి గా నిలువరించే అధికారం తప్పక ఉంటుంది. ప్రభుత్వ ప్రతినిధిగా పేదలకు వ్యతిరేకంగా వచ్చిన కోర్టు ఆర్డర్‌పై పోరాడే ‘పవర్’ కచ్చితంగా ఉంటుంది. కానీ, ఆ ప్రజాప్రతినిధి ఇవేమీ చేయలేదంటే దాని వెనుక ఉన్న అసలు ఆంతర్యం భూదాన్ భూముల్లో గుడిసెలు లేకుండా చేసి అనుచరులకు మేలు కలిగించడమేనన్న చర్చ నడుస్తున్నది. తనకు రాజకీయంగా వెన్నంటి ఉండి అనేక పదవుల్లో కీలకంగా వ్యవహరించిన అనుయాయులకు మేలుచేసి వారి రుణం తీర్చుకోవాలనే దురుద్దేశంతోనే ఆ ప్రజాప్రతినిధి పేదలపైకి బుల్డోజర్లు పంపినట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో కాంగ్రెస్ ప్రభుత్వానికి మచ్చ వచ్చినా బేఫికర్ అన్నట్టుగా ప్రజాప్రతినిధి ముందుకుసాగినట్టుగా కనిపిస్తున్నది.
ప్రజాప్రతినిధి కుమారుడి కక్ష?
గుడిసెల తొలగింపులో ప్రజాప్రతినిధి కుమారుడి పాత్ర కూడా ఉన్నదనే ప్రచారం ముమ్మరంగా సాగుతున్నది. దమ్మపేట ప్రాంతంలో ఒకప్పుడు తాము కొనుగోలు చేసిన భూమిలోనూ అక్కడ ఎంఎల్ పార్టీకి చెందిన నాయకులు భూదాన్ భూమి పేరిట పేదలతో గుడిసెలు వేయించి ఆక్రమించారని ప్రజాప్రతినిధి కుమారుడు ఇప్పుడు కక్షపూరిత చర్యలకు పూనుకొన్నాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్కడ భూములను తమకు కాకుండా చేసిన నాయకులే ఇక్కడ కూడా వేయించారని, వారికి తగిన శాస్తి కలిగేలా చేయాలనే ఉద్దేశంతోనే వారు వేయించిన గుడిసెలను లేకుండా చేయాలన్న తలంపుతో ప్రజాప్రతినిధి కుమారుడు ముందుకు పోయినట్టు ప్రచారం జరుగుతుండగా వాస్తవాలేమిటో తెలియాల్సి ఉన్నది.