ఖమ్మం సిటీ/ రఘునాథపాలెం, ఫిబ్రవరి 25 : ఫిబ్రవరి 25 : గూడు చెదిరి.. గుండె పగిలి.. నడి రోడ్డుపై కట్టుబట్టలతో మిగిలిన నిరుపేదలపై కాంగ్రెస్ సర్కార్ కర్కశత్వాన్ని ప్రదర్శించింది. ఆకలితో అలమటిస్తూ.. ఏడుస్తున్న చంటి బిడ్డలను ఎత్తుకొని ‘ఇదేం దౌర్జన్యం?’ అని నిలదీసిన నిర్భాగ్యులను ఉక్కుపాదంతో అణచివేసింది. కనీసం తాగేందుకు నీళ్లు కూడా లేక అలమటిస్తున్న అభాగ్యులపై దమనకాండను కొనసాగించింది. ఖమ్మం అర్బన్ మండలం వెలుగుమట్ల ప్రాంతంలోని భూదాన్ భూముల్లో ఏండ్ల క్రితం కట్టుకున్న ఇండ్లను కూల్చడంతో వీధిన పడ్డ బాధిత కుటుంబాలు తమకు జరుగుతున్న అన్యాయంపై కడుపుమండి బుధవారం ఆందోళనకు దిగాయి. కనికరించి సాయం అందించాల్సిన సర్కారే పోలీసులతో బాధితులను ఈడ్చి పారేయించి భూములు స్వాధీనం చేసుకున్నది.
ఇండ్ల ఆనవాళ్లు లేకుండా..
వెలుగుమట్ల ప్రాంతంలోని భూదాన్ భూముల్లో పది, పన్నెండేండ్లుగా వందలాది మంది అభాగ్యులు గుడిసెలు, పలువురు పక్కా ఇండ్లు కట్టుకొని జీవనం సాగిస్తున్నారు. అక్కడి వారికి సర్కార్ ఎలాంటి నోటీసులూ ఇవ్వకుండా ప్రత్యామ్నాయం చూపకుండా మంగళవారం పొద్దుపొద్దున్నే వందలాది మంది పోలీసులు, పారా మిలిటరీ బలగాలను మోహరింపజేసి జేసీబీలు, బుల్డోజర్లతో భూదాన్ భూముల్లోని ఇండ్లను కూల్చివేయించింది. అధికారులు, పోలీసులు కలిసి ట్రాక్టర్లు, ఇతర వాహనాల్లో బాధితులను తీసుకెళ్లి ఖమ్మం అంబేద్కర్ భవనం, టీటీడీసీ భవనంలో పడేసి వెళ్లారు. బుధవారం కూడా నిర్మాణాల కూల్చివేత పనులు కొనసాగించారు. అక్కడ ఇండ్లు, గుడిసెల ఆనవాళ్లు లేకుండా చేసేలా చదును పనుల పేరుతో హడావుడి చేశారు. మిగిలిపోయిన సామగ్రి, వస్తువులను వాహనాల్లో తరలిస్తున్నారు. పోలీసులు, అధికారుల హంగామా చూసిన నిరుపేదలు ఇంకా భయాందోళన నుంచి తేరుకోలేదు.
సహనం నశించి బాధితుల ఆందోళన
పశువుల కొట్టంలో పడేసిన మాదిరిగా పేదలను బలవంతంగా తీసుకొచ్చి ఎలాంటి సౌకర్యాలూ లేని భవనాల్లో పడేశారు. తాగేందుకు నీళ్ల వసతి కూడా ఏర్పాటు చేయలేదు. వండుకొని తిందామంటే గిన్నెలు, సామగ్రి అంతా ధ్వంసం చేశారు. బుక్కెడు బువ్వ పెట్టే నాథుడు లేడు. ఆకలితో చిన్నారులు ఏడుస్తున్నా కనికరించేవాళ్లు లేరు. పిల్లల భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేశారు. ఈ విపత్కర పరిస్థితికి సహనం నశించి భూదాన్ భూముల బాధితులు పలు రాజకీయ పార్టీలు, సంఘాల సహకారంతో ఖమ్మంలోని టీటీడీసీ భవనం ఎదురుగా రోడ్డెక్కారు. ఈ దుస్థితికి కారణమైన కాంగ్రెస్ సర్కార్‌ను తమ నినాదాలతో చీల్చి చెండాడారు. ఎండను సైతం లెక్క చేయకుండా ఆందోళనకు దిగారు. ‘సీఎం రేవంత్‌రెడ్డి డౌన్‌డౌన్.. ఖమ్మం మంత్రులు దొంగలు’ అని తీవ్రంగా మండిపడ్డారు. ‘మా ఇండ్లను కూలుస్తామని ఎన్నికల ముందు ఎందుకు చెప్పలేదు?’ అంటూ నిలదీశారు. తక్షణమే తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పదేండ్లలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ సర్కార్ ఏనాడూ తమకు ఇలాంటి దుస్థితి రానివ్వలేదని, నీళ్లు, కరెంట్ కూడా ఇచ్చిందని జ్ఞప్తికి తెచ్చుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతోనే తమకు దరిద్రం పట్టిందని దుమ్మెత్తిపోశారు. దాదాపు గంటసేపు రోడ్డుకు అడ్డంగా బైఠాయించి కాంగ్రెస్ సర్కార్‌ను కడిగి పారేశారు. నమ్మి ఓట్లేసిన పాపానికి తమ బతుకులను రోడ్డు పాలు చేశారంటూ బాధితులు రోదించిన తీరు హృదయ విదారకంగా మారింది.
పోలీసుల దౌర్జన్యం
ఎవరికీ ఎలాంటి హానీ తలపెట్టకుండా గాంధేయ మార్గంలో, శాంతియుత పంథాలో నిరసనకు దిగిన పేదలపై ఖమ్మం పోలీసులు దౌర్జన్యం చేశారు. న్యాయం చేయాలని వాళ్లు అడగడమే మహాపాపంగా భావించి పోలీసులు రెచ్చిపోయారు. కాంగ్రెస్ పెద్దల మనోభీష్టానికి అద్దం పట్టేలా బాధితులపై తమ ప్రతాపాన్ని చూపారు. మహిళలు, చిన్నారులు, వృద్ధులు అనే తేడా లేకుండా రోడ్డుపై కనిపించిన వారినల్లా బలవంతంగా ఈడ్చి పారేశారు. చేతులెత్తి మొక్కినా, కాళ్లమీద పడి ప్రాధేయపడినా ఏమాత్రం కనికరించలేదు. యువకులను అరెస్టు చేసి వివిధ పోలీస్స్టేషన్లకు తరలించారు. ధర్నాకు దిగిన మహిళలను రోప్ పార్టీ బృందాలు ఉక్కుపాదం మోపి బలవంతంగా టీటీడీసీ భవనంలోకి నెట్టివేశాయి. ఈ క్రమంలో పలువురు మహిళలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
రెండు రోజుల నుంచి పస్తులుండటంతో సొమ్మసిల్లి పడిపోయారు. అయినా అంబులెన్స్‌ను పిలిపించి వారిని దవాఖానకు పంపే ప్రయత్నం చేయలేదు. బాధితులకు బీఆర్ఎస్, సీపీఎం, బీజేపీ, సీపీఐ (ఎంఎల్ ) న్యూడెమోక్రసీ, మాస్‌లైన్, ఆప్ తదితర పార్టీలు, పలు సంఘాలు మద్దతుగా నిలిచాయి. కాంగ్రెస్ సర్కార్ దాష్టీకాన్ని దునుమాడాయి. తక్షణమే పేదలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశాయి. కాగా, నగరం నడిబొడ్డున ఇంత తతంగం జరుగుతున్నా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు ఏ ఒక్కరూ అటువైపు తొంగి చూసిన పాపాన పోలేదు. పైగా, తమ ప్రభుత్వం చేసింది కరెక్టే అన్నట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవడం గమనార్హం.
సర్కార్‌పై దుమ్మెత్తిపోసిన బాధితులు
‘జిల్లాకు చెందిన మంత్రుల ఆదేశాలతోనే అధికారులు మా గుడిసెలను తొలగించిండ్రు. ఇదంతా మంత్రుల ప్రమేయంతోనే జరిగింది’ అని నిరాశ్రయులు కరాఖండిగా చెప్తున్నారు. పోలీసులు, అధికారులు బుల్డోజర్లతో చేసిన దండయాత్రలో చెల్లాచెదురైన తమ ఇంటి సామగ్రిని ఏరుకుంటూ పక్కన పెట్టుకుంటున్నారు. తలుపులు, కిటికీలు, రేకులు, గ్రిల్స్, పైపులు వంటి వాటిని సేకరించి పెట్టుకున్నారు. ఇండ్లు కోల్పోయిన కోపంతో ఉన్న తమ నుంచి పేర్లు నమోదు చేయించుకున్న అధికారులపై బాధితులు మండిపడ్డారు. ఇండ్ల స్థలాలు ఇచ్చే ఆలోచనే ప్రభుత్వానికి ఉంటే రెక్కల కష్టంతో రూ.లక్షలు పెట్టి కట్టుకున్న ఇండ్లను ఎందుకు కూల్చివేస్తారని నిలదీశారు. జిల్లా మంత్రులు తమ అనుచరులు, అనుయాయులకు భూములు కట్టబెట్టే ఉద్దేశంతోనే తమపై బుల్డోజర్ల ప్రయోగం చేసి ఇండ్లు కూల్చివేశారని నిప్పులు చెరిగారు.
కాంగ్రెస్‌ను బొంద పెడుతం
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను కచ్చితంగా బొంద పెడుతం. ఎన్నో ఏండ్లుగా భూదాన్ భూముల్లో మేము ఇండ్లు కట్టుకొని ఉంటున్నం. పెద్ద కాలనీగా ఏర్పాటైన తర్వాత మంత్రులు తమ అధికార బలాన్ని పేదలపై చూపించి 600కు పైగా ఇండ్లను కూల్చివేయించిండ్రు. ముందుగానే అధికారులు వచ్చి ఇండ్లు కట్టుకోవద్దని చెప్తే అప్పుడే కట్టుకోకుండా ఉండేటోళ్లం. లక్షలు ఖర్చు చేసి కట్టుకున్న ఇండ్లను కూల్చివేసి మాకు గూడు లేకుండా చేసిండ్రు. ఇప్పుడు మొత్తానికే ఇక్కడి నుంచి వెళ్లగొట్టాలని అధికారులు దౌర్జన్యం చేస్తున్నరు.
-కన్నెకంటి విజయ,బాధితురాలు, ఖమ్మం
కేసీఆర్ హయాంలో మంచిగుండె
గుడిసెలు కట్టుకొని ఉంటున్న మాకు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండె. అప్పటి మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ మాకు పట్టాలు ఇప్పించే ప్రయత్నం చేసిండు. లక్షలు పోసి కట్టుకున్న మా ఇండ్లపైకి కాంగ్రెస్ వచ్చిన రెండేండ్లకే బుల్డోజర్లు పంపి కూల్చిపారేసింది. జిల్లా మంత్రులే మా కుటుంబాలను కట్టుబట్టలతో వీధిన పడేయించిండ్రు. మా ఉసురు మంత్రులకు తప్పక తాకుతది.
– వేల్పుల సత్యనారాయణ, సుగుణ (దంపతులు)
నమ్మి ఓటేస్తే నడిబజార్ల నిలబెట్టిండ్రు

ప్రజాపాలన అందిస్తమని కాంగ్రెస్ చెప్తే నమ్మినందుకు మమ్మల్ని నడిబజార్ల నిలబెట్టింది. రెండేండ్లనుంచీ పేదల ఇండ్లు కూల్చడమే పనిగా పెట్టుకొని సర్కార్ పాలన సాగిస్తున్నది. మంత్రుల అనుచరుల మేలు కోసమే మా ఇండ్లను కూల్చిండ్రు. కాంగ్రెసోళ్లు మళ్లా ఓట్ల కోసం వస్తే, ఉరికించి కొడుతం!

ఆందోళన చేస్తున్న మహిళలను ఈడ్చుకెళ్తున్న పోలీసులు

ఒక వైపు ఎక్స్‌కవేటర్‌తో ఇండ్లను కూల్చుతుండగా.. మరోవైపు శిథిలాల్లో తినుబండారాల కోసం వెతుకుతున్న చిన్నారులు

ఖమ్మం వైరా రహదారి టీటీడీసీ వద్ద రోడ్డుపై బైఠాయించిన భూదాన్ భూముల్లో ఇండ్లు కోల్పోయిన బాధితులు

రేవంత్ సర్కార్ ఇల్లు కూల్చడంతో నిలువ నీడ లేక శిథిలాల వద్ద చదువుకుంటున్న చిన్నారులు

ఆందోళనలో సొమ్మసిల్లిపడిపోయిన మహిళ.. బాధితుడిని లాగిపడేస్తున్న పోలీసులు