గర్భధారణ మహిళల జీవితంలో అత్యంత కీలకమైంది. ఈ సమయంలో వారి శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి. ప్రసవం తర్వాత కూడా వాటి ప్రభావం ఉంటుంది. అలాంటి సమస్యల్లో జుట్టు రాలడం ఒకటి. ఇందుకు కారణాలు అనేకం. ముఖ్యంగా, ప్రసవం తర్వాత ఈస్ట్రోజెన్ హార్మోన్ స్థాయులు ఒక్కసారిగా పడిపోతాయి. ఫలితంగా జుట్టు రాలిపోతుంది. ఇక మరికొందరిలో పోషకాహార లోపం కూడా కనిపిస్తుంది. ప్రెగ్నెన్సీ సమయంలో బరువు పెరగడం వల్ల.. డైట్ మొదలుపెడతారు.
దీంతో ఐరన్, ప్రోటీన్ వంటి పోషకాలు అందక.. జుట్టు రాలుతుంది. అంతేకాకుండా తల్లిగా బాధ్యతలు పెరగడం, ఒత్తిడి కూడా జుట్టు రాలడానికి కారణం అవుతుంది. బిడ్డను చూసుకోవడం, రాత్రంతా మేల్కొని ఉండటం, శారీరక అలసట.. అన్నీ కలిసి మహిళల్ని మానసికంగా క్షీణింపజేస్తాయి. దీంతో, జుట్టు రాలడం మొదలవుతుంది. ఈ సమస్య నుంచి బయట పడాలంటే..
ముందుగా మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలి. ప్రసవం తర్వాత ఎదురయ్యే ఒత్తిడిని తగ్గించుకోవాలి. ఇందుకోసం యోగా, ధ్యానం, వ్యాయామం అలవాటు చేసుకోవాలి. తాజా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలతోపాటు ప్రొటీన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఇక జుట్టు సంరక్షణ కోసం సహజసిద్ధమైన చిట్కాలను పాటించాలి. ఇలా, అన్ని చర్యలు తీసుకుంటే.. ప్రసవం తర్వాత జుట్టు రాలకుండా కాపాడుకోవచ్చు.