Virosh | టాలీవుడ్ స్టార్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వివాహం గురువారం (ఫిబ్రవరి 27) రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ప్రముఖ ప్యాలెస్ వేదికగా కుటుంబ సభ్యులు, ఆత్మీయుల సమక్షంలో ఈ వేడుక వైభవంగా నిర్వహించారు. గురువారం ఉదయం సుమారు 10 గంటల సమయంలో రష్మిక మెడలో మూడు ముళ్లు వేసి విజయ్ దేవరకొండ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ముందుగా తెలుగు సంప్రదాయ పద్ధతిలో పెళ్లి జరుగగా, అనంతరం కొడగు సంప్రదాయం ప్రకారం మరోసారి వివాహ తంతు నిర్వహించారు. రెండు సంస్కృతుల సమ్మేళనంగా జరిగిన ఈ వేడుక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
పెళ్లి తంతు పూర్తయ్యాక నూతన దంపతులు తమ వివాహానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో స్వయంగా పంచుకున్నారు. ఈ చిత్రాలు విడుదలైన వెంటనే అభిమానులు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలతో సోషల్ మీడియాను ముంచెత్తుతున్నారు. వివాహం అనంతరం విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను మర్యాదపూర్వకంగా కలిశారు. సివిల్ డ్రెస్సులో ఆయన నివాసానికి వెళ్లిన ఈ జంట, తమ వివాహ రిసెప్షన్‌కు రావాలని ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా గణపతి విగ్రహాన్ని ఆయనకు కానుకగా అందజేశారు. ఈ భేటీకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇక రిసెప్షన్ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో మార్చి 4న ఓ లగ్జరీ హోటల్లో ఘనంగా నిర్వహించనున్నట్లు సమాచారం. సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఈ వేడుకకు హాజరుకానున్నారని తెలుస్తోంది. మొత్తానికి, విజయ్–రష్మికల వివాహ వేడుక టాలీవుడ్లో ఈ ఏడాది అత్యంత చర్చనీయాంశమైన సంఘటనగా నిలిచింది. కొత్త జీవితాన్ని ప్రారంభించిన ఈ జంటకు అభిమానులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.